- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజల వద్దకే వ్యాక్సిన్.. పర్యవేక్షించనున్న సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : వ్యాక్సిన్ కోసం ప్రజలు టీకా కేంద్రాలకు రానవసరం లేకుండా వైద్య సిబ్బందే వారి దగ్గరకు వెళ్లి అందించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది. మే 1వ తేదీ నుంచి 18-44 ఏజ్ గ్రూపువారికి వ్యాక్సినేషన్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో టీకా కేంద్రాల దగ్గర రద్దీ ఏర్పడవద్దనేది ఇందుకు కారణం. ప్రస్తుతం ‘పల్స్ పోలియో’ కార్యక్రమం అమలు తరహాలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కసరత్తు చేస్తున్నది. దీంతో సోషల్ డిస్టెన్స్, వైరస్ వ్యాప్తికి తావుండదని వైద్యరోగ్యశాఖ భావిస్తున్నది. అందరికీ ఉచితం కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా వయసును ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రక్రియను వీలైనంత సరళంగా నిర్వహించాలనుకుంటున్నది.
కరోనా టెస్టులు చేయించుకోడానికి సెంటర్ల దగ్గర భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడం, గుంపులుగా చేరడం లాంటి పరిస్థితుల్ని బేరీజు వేసుకొనే వ్యాక్సినేషన్ యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. గతంలో ‘కంటి వెలుగు‘ పథకాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో ఏడాది పాటు సాఫీగా అమలైంది. ఇకపైన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనూ ఆయనే పర్యవేక్షిస్తారని సమాచారం
దేశానికే ఆదర్శంగా ఉండేలా రోడ్‌మ్యాప్
వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొత్తం దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండేలా రెండు నెలల రోడ్ మ్యాప్ తయారీపై వైద్యారోగ్య శాఖ దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా వచ్చే టీకాల సంగతి ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో టీకాలను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. భారత్ బయోటెక్ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్‘, రెడ్డీస్ లాబ్ సమకూర్చుకుంటున్న ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలో సుమారు రెండున్నర కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఐదు కోట్ల డోసుల్లో గరిష్ఠంగా ఈ రెండు సంస్థల నుంచే సమకూర్చుకోవాలని భావిస్తున్నది. బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోయినా సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని అంచనా వేసిన సీఎం రాష్ట్రంలో అందరికీ ఉచితంగానే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
మేడిన్ తెలంగాణ టీకా
నెలకు కోటి డోసుల చొప్పున ప్రస్తుతం భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్నది. త్వరలో ఈ సామర్థ్యాన్ని పెంచుతున్నందున వీలైనంత ఎక్కువ డోసుల్ని ఈ సంస్థ నుంచి కొనుగోలు చేయాలనుకుంటున్నది. ఇక రెడ్డీస్ లాబ్ ‘స్పుత్నిక్-వీ’ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటున్నందున అందులో తొలి ప్రాధాన్యంగా తెలంగాణకు వీలైనంత ఎక్కువగా విక్రయించేలా ఆ సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ రెండు సంస్థల నుంచి వీలైనంత ఎక్కువ మోతాదులో కొని తక్కువ సమయంలోనే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనుకుంటున్నది. థర్డ్ వేవ్ నవంబరు-డిసెంబరు మధ్య కాలంలో వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణుల అంచనాకు అనుగుణంగా అప్పటికల్లా కనీసం మూడు కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేయనున్నది.
విస్తృతంగా వ్యాక్సినేషన్ కేంద్రాలు
ప్రస్తుతం ‘పల్స్ పోలియో‘ కార్యక్రమాన్ని నర్సులు, ఏఎన్ఎంలు, ‘ఆశా‘ వర్కర్లు గ్రామాల స్థాయి వరకు నిర్వహిస్తున్నారు. ఆ వైద్య సిబ్బందితోనే ఇకపైన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్.. ఇలా జనం ఎక్కడుంటే అక్కడకు వెళ్ళి ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విధానం ద్వారా రద్దీని నివారించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ వారి ఇండ్లకు సమీపంలోనే అందుతుందన్న నమ్మకం కలుగుతుంది. ఇంకోవైపు కరోనా కట్టడి కోసం ఎలాంటి ఆంక్షలు ఉన్నా రోడ్డుమీదకు రానవసరం లేకుండా ఆయా కాలనీల్లోనే కమ్యూనిటీ హాళ్ళు లేదా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయడం ద్వారా నిరాటంకంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసే వీలు ఉంటుందన్నది వైద్యారోగ్య వర్గాల భావన.
రెండు మూడు రోజుల్లో సీఎం సమీక్ష
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు మూడు రోజుల్లో సీఎస్, వైద్యారోగ్య శాఖ అధికారులతో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రక్రియ అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. వ్యాక్సిన్‌ను సమకూర్చుకోవడం, పంపిణీ, వైద్యారోగ్య శాఖ నెట్‌వర్క్, సిబ్బంది లభ్యత, కార్యాచరణ ప్రణాళిక, విధి విధానాలు, మార్గదర్శకాలు, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ పై ఈ సమావేశం తర్వాత స్పష్టత రానుంది. మే నెల 1వ తేదీ నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ కానున్నందున అప్పటికల్లా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
ఎక్కువ డోసులు తెలంగాణకే ఇస్తాం : భారత్ బయోటెక్
రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున అవసరమైనంత సంఖ్యలో డోసులను సమకూర్చుకోవడంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సచివాలయంలో మంగళవారం భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, డైరెక్టర్ తదితర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రజలందరికీ సరిపోయేలా వీలైనంత ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్‌ను సమకూర్చాల్సిందిగా డాక్టర్ కృష్ణ ఎల్లాకు సీఎస్ విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కృష్ణ ఎల్లా, తెలంగాణ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, అత్యధిక సంఖ్యలో డోసులను సరఫరా చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.