టీకా వేసుకున్నా.. వృద్ధులకు ‘డెల్టా’ ముప్పు

by Shamantha N |
టీకా వేసుకున్నా.. వృద్ధులకు ‘డెల్టా’ ముప్పు
X

న్యూఢిల్లీ: కరోనాతో ముప్పు ఎక్కువ అని భావించి వృద్ధులకు టీకా వేయడానికి కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పటికీ వారికి ఉచితంగా టీకా పంపిణీ చేస్తున్నది. కానీ, కరోనా సెకండ్ వేవ్‌తో విజృంభించిన డెల్టా వేరియంట్ వృద్ధులకు ప్రమాదకారిగా మారనుంది. రెండు డోసుల టీకా వేసుకున్నప్పటికీ వయోవృద్ధులకు ఈ స్ట్రెయిన్ సోకే ప్రమాదమున్నదని ఓ అధ్యయనం వెల్లడించింది. అందుకే మూడో డోసు వేసుకోవడమూ అవసరమని ది లాన్సెట్‌లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసం పేర్కొంది. భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందిన దేశాల్లో వృద్ధులకు రెండు డోసులను పంపిణీ చేసి ఊరుకోవద్దని, బూస్టర్ డోసుగా మూడోదీ ఇవ్వాలని వివరించింది.

డెల్టా వేరియంట్ రెండంచుల కత్తి వంటిదని, టీకా సామర్థ్యాన్ని ఎదుర్కోవడమే కాదు, వేగంగా వ్యాప్తి చెందే గుణమూ దానికి ఉన్నదని యూకే శాస్త్రవేత్తల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బృందం ఫైజర్ ఎంఆర్ఎన్ఏ టీకాపై పరిశోధనలు చేసింది. ఫైజర్ టీకా వేసుకున్నా డెల్టా వేరియంట్ సోకుతున్నట్టు కనుగొన్నారని, కానీ, అది సివియర్‌గా మారకుండా నిరోధిస్తున్నదని వివరించింది. ఒక్క డోసూ తీసుకోకపోవడం కంటే సింగిల్ డోసు తీసుకున్నవారు వైరస్‌తో మెరుగ్గా పోరాడుతారని పేర్కొంది. వయసు పెరిగినవారిలో డెల్టా వేరియంట్‌పై యాంటీబాడీల యాక్టివిటీ స్వల్పంగా ఉన్నదని, కాబట్టి, ఆ వేరియంట్ అధికంగా ఉన్న దేశాల్లో వయోవృద్ధులకు బూస్టర్ డోసు ఇవ్వడం ఉత్తమమని అభిప్రాయపడింది. ఈ బృందం కేవలం ఫైజర్ టీకాపై చేసిన ప్రయోగాలను మాత్రమే ప్రచురించింది.

టీకా వేసుకున్న తర్వాత కూడా కరోనా వైరస్ సోకే కేసులను బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్‌లు అంటాం. ఈ కేసులు భారత్‌లో అధికంగా ఉండే అవకాశముందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఛండీగడ్‌లోని పీజీ ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు, హెల్త్‌కేర్ వర్కర్లపై చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని వెలుగులోకి వచ్చింది. 12,248 మంది హెల్త్‌కేర్ వర్కర్లపై వారు పరిశోధనలు చేశారు. ఇందులో సింగిల్ డోసు తీసుకున్నవారు, రెండు డోసులు తీసుకున్నవారు, అసలు టీకా తీసుకోనివారూ ఉన్నారు. వీరిపై చేసిన ప్రయోగంలో సింగిల్ డోసు తీసుకున్న 7170 మందిలో 184 మందికి కరోనా సోకింది.

రెండు డోసులూ తీసుకున్న 3650 మందిలో 72 మందికి(రెండు శాతం) వైరస్ ఇన్ఫెక్ట్ అయింది. రెండో డోసు పడ్డాక రెండు వారాల తర్వాతనే సదరు వ్యక్తికి సంపూర్ణ వ్యాక్సినేషన్ పూర్తయిందంటాం. కాబట్టి, ఈ గడువు పూర్తి చేసుకన్న తర్వాత వైరస్ బారిన పడ్డవారు ఇందులో 3000మందికిగాను 48 మంది ఉన్నారు. అంటే, సంపూర్ణ టీకా పొందినప్పటికీ 1.6శాతం మంది మళ్లీ వైరస్ బారినపడ్డారు. ఫైజర్, మొడెర్నా వేసుకున్న తర్వాతా 0.5శాతం మంది హెల్త్‌కేర్ వర్కర్లు వైరస్ బారినపడ్డట్టు యూఎస్‌లో ఓ అధ్యయనం ప్రచురించిన తర్వాత భారత్‌లోనూ అలాంటి పరిశోధన ఫలితాలే ప్రచురించారు. పై లెక్కల ప్రకారం, అమెరికాలో కంటే భారత్‌లోనే ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కరోనా బారినపడే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు.

డెల్టానే కారణమా?

టీకా వేసుకున్నప్పటికీ ఇన్ఫెక్ట్ అయ్యే ముప్పు అధికంగా ఉండటానికి గల కారణం డెల్టా వేరియంటేననే అనుమానాలున్నాయి. ఢిల్లీలో ఎన్‌సీడీసీ, సీఎస్ఐఆర్‌కు చెందిన మరో పరిశోధనా సంస్థల శాస్త్రజ్ఞులు చేసిన అధ్యయనాలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. వీరి అధ్యయనంలో 27 బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్‌లను పరిశీలించగా, అందులో 76శాతం కేసులకు కారణం డెల్టా వేరియంటే అని తేలింది. కాబట్టి, వారి పరిశోధనాపత్రంలోనూ బీ.1.1.7 కంటే బీ.1.617.2తోనే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్‌లు ఎక్కువగా సోకే ముప్పు ఉన్నదని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed