ఢిల్లీ- డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ శంకుస్థాపన చేసిన ప్రధాని..

by Shamantha N |   ( Updated:2021-12-04 11:29:14.0  )
modi
X

దిశ, డెహ్రాడూన్: ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్‌తో సగానికి పైగా ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ లో ప్రధాని రూ.18,000 కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా రూ.8300 కోట్లతో నిర్మించనున్న ఢిల్లీ-డెహ్రాడూన్ వాణిజ్య కారిడార్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ‘అత్యాధునికి మౌళిక వసతులను సమకూర్చేందుకు భారత్ రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు కదిలింది. గత 5 ఏళ్లలో రూ.లక్ష కోట్లు ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఢిల్లీ-డెహ్రాడూన్ వాణిజ్య కారిడార్ నిర్మాణ పనులను ప్రారంభించడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

ఈ మార్గం సిద్దమైనప్పుడు, ఢిల్లీ- డెహ్రాడూన్ కారిడార్ మధ్య ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గుతుంది’ అని అన్నారు. మన పర్వతాలు, సంస్కృతి కేవలం మన విశ్వాసం మాత్రమే కాదని, దేశ భద్రతకు కోటగోడల్లా నిలుస్తున్నాయని తెలిపారు. పర్వతాలలో నివసించే ప్రజల జీవన సౌలభ్యానికి తాము ప్రాధాన్యతమిస్తామని చెప్పారు. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగిన వారి విధాన వ్యూహంలో ఇది ఎక్కడా లేదని అన్నారు. ‘2007-2014 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రూ.600 కోట్లతో 288 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేసింది. కానీ మా ప్రభుత్వం గత ఏడేళ్లలో రూ.12,000 కోట్లతో 2వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టింది. కొండ సరిహద్దు ప్రాంతాల్లో గత ప్రభుత్వం సరైన మౌళిక సదుపాయాల కల్పన చేయలేదు. ఈ వైఖరి అన్ని స్థాయిలలో సైన్యాన్ని నిరుత్సాహపరుస్తామని వారు ప్రమాణం చేసినట్లుగా ఉంది. మేము ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చాం. అత్యాధునిక ఆయుధాలు అందజేసి ఉగ్రవాదులను సమర్ధంగా ఎదుర్కొనేలా చేశాం అని తెలిపారు.

ఊపందుకొనున్న టూరిజం..

రోడ్డు సదుపాయాలతో పర్యాటక ప్రాంతంగా ఉత్తరాఖండ్ వృద్ధి చెందుతుందని అన్నారు. ‘ముఖ్యమైన దృష్టి రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే ప్రాజెక్టులపై ఉంటుంది. ఇది ప్రయాణాన్ని సాఫీగా, సురక్షితంగా చేస్తుంది. దీంతో పాటు ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుంది. ఇది ఒకప్పుడు సుదూర ప్రాంతాలుగా పరిగణించబడే ప్రాంతాలను అనుసంధానం చేయాలనే నా దృష్టికి అనుగుణంగా ఉంది’ అని తెలిపారు.

ప్రాజెక్టు హైలెట్స్ ఇవే..

ఈ కారిడార్ ఏర్పాటుతో ఇరు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుందని అన్నారు. ప్రధానంగా ఈ కారిడార్ హరిద్వార్, ముజఫర్ నగర్, షామిలి, యమునాగర్, భాగ్ పేట్, మీర్పుట్, బారట్ ప్రాంతాలను అనుసంధానం చేస్తుందని అన్నారు. వన్యప్రాణుల మార్గానికి ఆటంకం కలిగించకుండా నిర్మాణాలు చేపట్టనున్నారు. దట్ కాళీ దేవాలయం సమీపంలో అడవి జీవులకు ఇబ్బంది కలిగించకుండా 340మీటర్ల టన్నెల్ రహదారి నిర్మిస్తున్నారు. మొత్తంగా ఆసియాలోనే అత్యంత పొడవైన అనియంత్రిత వన్యజీవుల తరలివెళ్లడానికి 12 కిలోమీటర్ల పొడవైన వన్యప్రాణుల ఎలివేటెడ్ కారిడార్ కానుంది.

నావీ సిబ్బందికి శుభాకాంక్షలు..

నావీ డే(డిసెంబర్ 4)ను పురస్కరించుకుని ప్రధాని మోడీ నావీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సంక్షోభ పరిస్థితులను తగ్గించడంలో, ఆందోళనకర పరిస్థితుల్లో ముందున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా మన్ కీ బాత్ లో మాట్లాడిన ఆడియోను ట్వీట్ చేశారు. భారత నౌకాదళ ఆదర్శప్రాయమైన సహకారానికి మేము గర్విస్తున్నాము. మన నౌకాదళం దాని వృత్తి నైపుణ్యం, అత్యుత్తమ ధైర్యానికి గొప్పగా గౌరవాన్ని పొందుతుంది. ప్రకృతి వైపరీత్యాల వంటి సంక్షోభ పరిస్థితులలో సహయం చేయడంలో మన నౌకాదళ సిబ్బంది ఎప్పుడూ ముందుంటారు’ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed