కెప్టెన్‌గా గెలిచాడు..లీడర్‌గా ఓడాడు..ఎవరతను?

by Anukaran |   ( Updated:2020-12-04 11:26:32.0  )
కెప్టెన్‌గా గెలిచాడు..లీడర్‌గా ఓడాడు..ఎవరతను?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. ఆయన భారతదేశ సైనికుడిగా బార్డర్‌లో సక్సెస్ ఫుల్ మ్యాన్. కానీ ఎన్నికల బరిలో మాత్రం ఆయన సక్సెస్ కాలేకపోయారు. దేశ చరిత్రలోనే రికార్డులను సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛీఫ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రసాదించిందనే బలాన్ని ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ.. అసెంబ్లీ, స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు ఆది నుంచి ఉన్నాయి.

వీటిని తిప్పికొట్టేందుకు ఉత్తమ్ ఎంతగానో ప్రయత్నించారు. కానీ అది అసలే కాంగ్రెస్ పార్టీ. అందులో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెబుతుంటారు. ప్రత్యర్థులతో కొట్లాడేందుకు కలిసి రావాల్సిన సొంత పార్టీ నేతలే.. టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌పై బహిరంగంగా విమర్శలు చేస్తున్నా.. పట్టించుకున్న పాపానపోలేదు. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2015లో టీపీసీసీ ఛీప్‌గా బాధ్యతలు స్వీకరించి.. దాదాపు ఐదేండ్లకు పైగా కొనసాగారు. అయితే ఒక రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ఛీప్‌గా ఒకే వ్యక్తి ఇన్నేండ్లు ఉండడం అనేది ఓ రికార్డు. కానీ ఉత్తమ్.. ఈ ఐదేండ్ల కాలంలో తన సారథ్యంలో సాధించిన చెప్పుకోదగ్గ విజయాలేమైనా ఉన్నాయంటే.. ఒక్కటీ లేదనే చెప్పాలి.

ఇతర కారణాలు లేకపోలేదు..

కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్టు.. టీపీసీసీ ఛీప్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం కావడానికి సవాలక్ష కారణాలని చెప్పొచ్చు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వాస్తవానికి గ్రూపు రాజకీయాలు విపరీతం. ఒక్క సామాజిక వర్గాల వారీగానే కాకుండా ఇతరత్రా కోణాల్లోనూ తెలంగాణ కాంగ్రెస్‌లో బహిరంగంగానే గ్రూపుల వ్యవహారం నడిచేది. అలాంటి గ్రూపు రాజకీయాలను మెయింటెన్ చేయడంలో ఉత్తమ్ నిజంగా విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చలామణి అవుతున్న వారి మెప్పును పొందండంలోనూ అదే పరిస్థితి. టీపీసీసీ ఛీప్‌గా ఉత్తమ్ బాధ్యతలు చేపట్టే నాటికి.. పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారందరినీ కాదని ఉత్తమ్‌కు టీపీసీసీ పీఠం కట్టబెట్టారు. ఆ సందర్భంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను తన అనుకూలంగా మార్చుకోవడంపై ఏనాడూ దృష్టి సారించలేదు. దీంతో పార్టీ నేతలంతా ఎవరికీ వారే..యమునా తీరే అన్న చందంగా మారారు.

ఎన్నికల్లో ఘోర విఫలం..

టీపీసీసీ ఛీప్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాలను మూటగట్టుకుంటూ వస్తోంది. స్థానిక సంస్థలు, సాధారణ, మున్సిపల్, గ్రేటర్ ఎన్నికలు అన్న తేడా లేకుండా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. కొన్ని సందర్భాల్లోనూ ప్రత్యర్థులకు ఏ కోశాన పోటీనివ్వలేదు. దీనికితోడు సొంత పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు సైతం పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేశాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓటమి చెందడానికి కారణం నాయకత్వలేమి అనే చెప్పాలి. పార్టీకి, కార్యకర్తలకు మధ్య వారథిగా నిలవాల్సిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. ఆ మేరకు మనోధైరాన్ని ఇవ్వడంలో వెనుకబడడంతోనే కాంగ్రెస్ విజయాలను నమోదు చేసుకోవడంలో విఫలమయ్యింది.

Advertisement

Next Story

Most Viewed