- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తదేమో గానీ, ఉన్నసీటు ఊడింది.. పునరాలోచనలో బీజేపీ
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయంతో రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణాన్ని మార్చాలని భావించిన బీజేపీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొత్త సీటు సంగతేమోగానీ సిట్టింగ్ సీటును కూడా పోగొట్టుకుంది. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి తామేనంటూ ప్రచారం చేసుకున్న ఆ పార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో పోస్టుమార్టం మొదలైంది. కారణాలను అన్వేషించడంపై కసరత్తు జరుగుతోంది. ఈ ప్రభావం సమీప భవిష్యత్తులో పార్టీ బలపడడంపై ఏ మేరకు పడుతుందనే చర్చలూ ఆ పార్టీలో మొదలయ్యాయి.
వచ్చే నెల జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన జరుగుతోంది. పార్టీలో నాయకత్వం మొదలు కిందిస్థాయి కేడర్ వరకు ఎవరి లోపం ఏ మేరకు ఉంది, ఎక్కడ పొరపాటు జరిగింది.. ఇలాంటి అంశాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్‌రావు గెలిచేందుకు అవకాశాలు మెండుగా ఉన్నా ఎక్కడ బెడిసి కొట్టిందనే విశ్లేషణ మొదలైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అందుబాటులో ఉన్న వివరాల మేరకు నేతలు కూడికలు, తీసివేతలు వేసుకుంటున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల్లో రామచందర్‌రావుకు ఓట్లు తక్కువగా వచ్చాయనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. అటు పార్టీకి, ఇటు వ్యక్తిగా రామచందర్‌రావుకు బలమైన మద్దతు ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం పార్టీ నేతలకు మింగుడు పడడంలేదు. అధికార పార్టీని ఢీకొట్టి రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న తరుణంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పార్టీ నేతలను కలవరానికి గురిచేసింది.
మహబూబ్‌నగర్ జిల్లా శ్రేణుల్లో అసంతృప్తి
రామచందర్‌రావు హైదరాబాద్‌కు చెందిన నేత కావడం, ఆయన 2015లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేడర్‌కు టచ్‌లో లేరనే భావన అక్కడి ప్రజల్లో ఏర్పడిందని, అందువల్లనే ఈసారి ఆ ప్రభావం కనిపించిందనే అంచనాకు వచ్చారు. మహబూబ్‌నగర్‌కు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులు రామచందర్‌రావును గెలిపించుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేయలేదని, సమన్వయం కూడా సరిగ్గా లేదనే అసంతృప్తి సైతం రాష్ట్రస్థాయి నేతలైన కొద్దిమందిలో వ్యక్తమైంది.
వాణీదేవి గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు పట్టభద్రులైన ఓటర్లందరినీ టచ్ చేసిన తీరులో బీజేపీ కేడర్ చొరవ తీసుకోకపోవడం ఒక కారణమనే అభిప్రాయానికి వచ్చారు. దీనికి తోడు హైదరాబాద్ నగర పరిధిలో ఇటీవల గెలిచిన 47 మంది కార్పొరేటర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను అప్పజెప్పకపోవడం కూడా రాష్ట్ర కమిటీ తరపున జరిగిన ఒక ఫెయిల్యూర్ అనే చర్చలూ మొదలయ్యాయి. బల్దియా ఎన్నికల్లో ఫోకస్ చేసిన తీరులో పట్టభద్రుల ఎన్నికల మీద దృష్టి పెట్టలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల క్యాంపెయిన్‌లో రాంచందర్‌రావు ఒక్కరే ఎక్కువగా కష్టపడ్డారని, సిట్టింగ్ స్థానం కావడంతో జీహెచ్ఎంసీ గెలుపు తరహాలోనే సునాయాసంగా గట్టెక్కుతామనే ధీమా ఇందుకు కారణం కావచ్చనే అభిప్రాయాన్నీ ఒకరిద్దరు సీనియర్ నేతలు వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం ఎక్కువగా వరంగల్ ఎమ్మెల్సీ స్థానంపైనే ఫోకస్ పెట్టిందని, ఇది హైదరాబాద్ విషయంలో మైనస్‌గా మారిందని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి, రామచందర్‌రావు ఒకే (కరణం) సామాజికవర్గానికి చెందినవారు. కానీ ఓట్ల చీలికను బీజేపీ లైట్‌గా తీసుకుందని, చివరకు అభ్యర్థి గెలుపును ఆ ఓట్లే డిసైడ్ చేశాయని పార్టీ నాయకత్వం ఇప్పుడు భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు 70-75 వేల వరకూ ఉండొచ్చని ముందే అంచనా వేసింది.
అయినా ఓట్ల చీలికను నివారించే దిశగా పటిష్ట వ్యూహాన్ని రూపొందించు కోలేకపోయిందని, దాని ఫలితమే ఓటమి అని భావిస్తున్నారు. రాంచందర్‌రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసినవారు రెండో ప్రాధాన్యత ఓటును వాణీదేవికి వేసిన విషయం ఓట్ల లెక్కింపు సందర్భంగా తేటతెల్లమైంది. కారణాలేవైనా హైదరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు చేజారడంపైనే మాత్రం బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది.