- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రభుత్వంపై ఉండవల్లి ఏం చెప్పారో తెలుసా?
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎండగట్టారు. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తూనే… ఏం చేయాలో ఉండవల్లి ప్రభుత్వానికి సూచించే ప్రయత్నం చేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశానని వెల్లడించారు. అయితే ప్రభుత్వం ఆ లేఖను పట్టించుకోలేదని ఉండవల్లి తెలిపారు.
పాలకులకు ప్రజలే కనిపించాలి
పాలకులకు ప్రజలే కనిపించాలని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాధికారులు, ఎలక్షన్ కమిషన్ విషయంలో వచ్చిన తీర్పుల విషయంలో జడ్జీలపై సామాజిక మాధ్యమాల్లో పొస్టులు పెట్టడమేంటని వైఎస్సార్సీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేశ్ విషయంలో జగన్ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారని ప్రశ్నించిన ఆయన, ప్రెస్ మీట్ పెట్టి ఆయనపై మాట్లాడాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఏం చేసినా ఊరుకునేందుకు అక్కడ ఎల్వీ సుబ్రహ్మణ్యం కాదని, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏబీ వెంకటేశ్వరరావని ఆయన సూచించారు.
ఆవ భూముల్లో అవినీతి
ఉభయగోదావరి జిల్లాల్లో ఇళ్ల స్థలాల కోసం కొన్న ఆవ భూములపై విచారణ జరిపించాలని ఆ లేఖలో డిమాండ్ చేశానని అన్నారు. ఆవ భూములను అధిక ధరకు కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. ఆవ భూముల ధర అంత పెద్ద మొత్తంలో ఉండదని ఉండవల్లి స్పష్టం చేశారు. అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెబుతున్న జగన్ అక్కడ జరిగిన అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అధిక ధరకు భూములు కొనుగోలు చేసి పేదలకు ఇవ్వడమేంటని ఆయన నిలదీశారు. ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? అని ప్రశ్నించారు.
ఇసుక విధానం లోపభూయిష్టం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరైన ఇసుక విధానం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి ఇసుక విధానంపై ముందస్తు ప్రణాళికలు లేని కారణంగా ఏపీలో నిర్మాణం రంగం కుదేలైపోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర నిర్మాణ అవసరాలకు సరిపడా ఇసుకను ఇప్పటికీ అందించలేకపోతున్నారని ఆయన తెలిపారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇసుకు అందుబాటులో లేదని ఆయన అన్నారు. దీంతో ఇసుక విధానంలో అవినీతి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో నిర్మాణ రంగ కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రేట్లు పెరిగితే తాగడం మానేస్తారా?
మద్యం నియంత్రణ పేరిట ధరల భారీగా పెంచడంపై ఉండవల్లి మండిపడ్డారు. ఎక్కడైనా ధరలు పెరిగితే తాగడం మానేస్తారా? అని ప్రశ్నించారు. పక్కరాష్ట్రాల్లో ధరల కంటే ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయని చెప్పారు. ఫలితంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా అవుతుందని ఆయన గుర్తు చేశారు. సారాపై సొంత నేతలే అసహనం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ధరలు పెంచితే తాగడం మానేస్తారని అనుకోవడం భ్రమేనని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు 80,500 కోట్ల రూపాయలు పంచుతామని ప్రభుత్వం చెబుతోందన్న ఆయన అంతడబ్బు ఎక్కడ్నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు.