వియత్నాం యుద్ధ మృతుల సంఖ్యను దాటేసిన అమెరికా కరోనా మరణాలు

by vinod kumar |
వియత్నాం యుద్ధ మృతుల సంఖ్యను దాటేసిన అమెరికా కరోనా మరణాలు
X

వాషింగ్టన్/న్యూయార్క్: చైనాలో పుట్టిన కరోనా వైరస్ యూరోప్, అమెరికా దేశాలను అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ సృష్టిస్తోంది. ఇప్పటి వరకు కోవిడ్ – 19 కారణంగా అమెరికాలో 58,955 మంది మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కరోనా సెంటర్ వెల్లడించింది. 1955-1975 మధ్య రెండు దశాబ్దాల పాటు జరిగిన వియాత్నం గెరిల్లా యుద్ధంలో 58,220 మంది సైనికులు మరణించారు. అంటే అప్పుడు మరణించిన వారి కంటే ప్రస్తుతం కరోనా కారణంగా అమెరికాలో సంభవించిన మరణాల సంఖ్యే ఎక్కువ. మంగళవారం నాటికి అమెరికాలో 10,34,588 మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యారు. ప్రపంచంలో కరోనా బారిన పడిన వాళ్లలో మూడో వంతు అమెరికాలోనే ఉండటం గమనార్హం. అంతే కాకుండా కరోనా మరణాల్లో 1/4వ వంతు అమెరికాలోనే సంభవిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గత వారం రోజుల గణాంకాలు పరిశీలిస్తే అమెరికా కరోనా కేంద్రంగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అమెరికాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు గణనీయంగా తగ్గుతుండటంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అత్యంత గడ్డు పరిస్థితులు ముగిశాయని.. ఈ సమయంలో అమెరికా ప్రజలు చేసిన త్యాగాలను మరవలేమని ఆయన అన్నారు. మరోవైపు వైద్య రంగానికి చెందిన నిపుణులు, ఇతర అధికారులపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి తీవ్రతను అంచనా వేయడంలో వాళ్లు విఫలమయ్యారని మండిపడ్డారు. కాగా, పలు రాష్ట్రాల గవర్నర్లు మాత్రం మరి కొన్ని రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరుతున్నారు

Tags : Vietnam, War, America, USA, Coronavirus, Covid 19, Deaths, Donald Trump

Advertisement

Next Story

Most Viewed