శానిటైజర్ తాగి ఇద్దరు మహిళలు, వ్యక్తి మృతి

by srinivas |   ( Updated:2020-06-29 23:42:05.0  )
శానిటైజర్ తాగి ఇద్దరు మహిళలు, వ్యక్తి మృతి
X

దిశ, అమరావతి బ్యూరో: లిక్కర్‌ ధరలు విపరీతంగా పెరగడంతో మద్యానికి బానిసలైన కొందరు తక్కువ ధరకు లభించే హ్యాండ్‌ శానిటైజర్‌ ద్రావణం సేవించి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన శానిటైజర్‌ తాగి చిత్తుకాగితాలు ఏరుకునే ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు మృతిచెందిన దుర్ఘటన తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరులో వెలుగు చూసింది. స్థానిక సింధు జంక్షన్‌ సమీపంలో యోగిమల్లవరం బీసీ కాలనీకి చెందిన నటరాజ్‌ అనే వ్యక్తి పాత సామాన్ల దుకాణం (గుజరీ) నడుపుతున్నారు. తమిళనాడు, తిరుపతికి చెందిన కొంతమంది చుట్టుపక్కల గ్రామాల్లో ప్లాస్టిక్‌, చిత్తుకాగితాలు సేకరించి నటరాజ్‌ దుకాణంలో విక్రయిస్తూ ఆ పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటారు. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా పుదిపేటకు చెందిన మల్లిక (23), లత (35) ఈ గుజరీ దుకాణం వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తిరుపతి పేపర్స్‌ కాలనీకి చెందిన సెల్వం (50) కూడా వీరితో ఉండేవాడు. ఇటీవలి కాలంలో లిక్కర్‌ ధరలు విపరీతంగా పెరగడం, శానిటైజర్‌ సీసాలు విరివిగా లభిస్తుండడంతో వీరు మత్తు కోసం శానిటైజర్‌ తాగడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం శానిటైజర్‌ తాగినవెంటనే ఈ ముగ్గురి పరిస్థితి విషమించింది. సోమవారం ఉదయానికి లత, మల్లిక గుజరీ దుకాణం వద్దే ప్రాణాలు కోల్పోయారు. మరోవ్యక్తి సెల్వం సోమవారం రాత్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. శానిటైజర్లు సేవించడం ప్రాణాంతకమని సీఐ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed