‘నుడా’ కుర్చీపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గురి..!

by Shyam |   ( Updated:2021-03-13 20:24:27.0  )
‘నుడా’ కుర్చీపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గురి..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ ‘నుడా ’చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రభాకర్ రెడ్డి 18 నెలలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. నుడా చైర్మన్ పదవీ కాలం ఎడాది కాగా గడిచిన సెప్టెంబర్ 31తో ప్రభాకర్‌రెడ్డి అధ్వర్యంలోని ముగిసినా పాలకవర్గం కాల పరిమితిని ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ఈ గడువు కూడా నెలాఖరుతో ముగియనుండటంతో జిల్లాలో కొత్తగా నుడా చైర్మన్ పదవీ ఎవరిని వరిస్తుందో అని అధికార పార్టీలో చర్చ మొదలైంది. మరోవైపు చామకూర ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం పొడిగిస్తారా లేక కొత్త కార్యవర్గం ఎర్పాటు చేస్తారా అని అంతా అసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి పార్టీలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుండటంతో రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత నుడాను ఏర్పాటు చేసి ఆయన్ను చైర్మన్‌ను చేసింది. 18 నెలల కాలంలో నుడాను ఫాంలోకి తీసుకురావడానికి ప్రభాకర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పనిచేశారు.

ఎమ్మెల్యేల పైరవీలు..

నుడా పాలకవర్గం కాల పరిమితి ఈ నెలఖరుతో ముగియనుండటంతో దీని పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు అపదవిని తమ వారికి ఇప్పించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని సమాచారం. నుడా చైర్మన్ పదవీ కోసం వారు ఎమ్మెల్సీ కవితతో పాటు పార్టీ అధిష్ఠానం దగ్గర ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఓ ఎమ్మెల్యేకు తన అనుచరుల్లో ఒకరు నుడా చైర్మన్ పదవి కోసం కారు కూడా కొనిచ్చారని, పార్టీ కార్యక్రమాల్లో ఖర్చుకు వెనకాడకుండా పనిచేస్తున్నాడని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతున్నది. మరో ఎమ్మెల్యే కూడా నుడా చైర్మన్ పదవి తాను చెప్పిన వారికే కావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడని తెలుస్తున్నది. సదరు ఎమ్మెల్యే ఆ పదవి తన అనుచరులకు ఇస్తారా లేక రక్త సంబంధికులకు ఇప్పించుకుంటారా అనేది క్లారిటి లేకపోయినా.. నుడా చైర్మన్ పదవి కోసం గట్టిగానే పట్టుబడుతున్నాడని సమాచారం. కాగా, నుడా చైర్మన్ పదవీ కోసం గ్రామీణం నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోసారి పొడిగిస్తారా?

నుడా పాలకవర్గం కాల పరిమితి ఈ నెలఖరుతో ముగిసినా మరోసారి పొడిగిస్తారనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కొత్తగా పాలకవర్గం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? నిబంధనల ప్రకారం పొడిగించవచ్చా అనే కోణంలో పార్టీ అధినాయకత్వం అలోచిస్తున్నట్లు తెలిసింది. ప్రభాకర్‌రెడ్డి నుడా పరిధిలోని అందరు ఎమ్మెల్యేలతో బ్యాలెన్స్‌గానే వ్యవహరిస్తూ అటు ఎమ్మెల్సీ కవితకు నమ్మకస్తుడిగా, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి దగ్గరగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త పాలకవర్గం ఏర్పాటుకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ముగిసే వరకు పక్కనపెట్టే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, నుడా చైర్మన్ పదవిని తమ వారికోసం అశిస్తున్న ఆ ఇద్ధరు ఎమ్మెల్యేల ట్రాక్ రికార్డు ఎమ్మెల్సీ కవిత దగ్గరనే పెద్దగా లేదని, ఎంపీ ఎన్నికలలో తన ఓటమికి కారకుల్లో ఆ ఇద్ధరూ ఉన్నారని, వారి అనుచరులకు చైర్మన్ పదవి దక్కదనే మరో వాదన వినిపిస్తున్నది. మరి ఎమ్మెల్యే ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే..

Advertisement

Next Story

Most Viewed