- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఇద్దరూ ఉన్నతాధికారులే..కానీ..
ఆ ఇద్దరూ ఉన్నతాధికారులు ప్రజలకు సేవ చేయాలనే ఉన్నత ఆశయాలతో తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో కార్యకర్తలుగా పాల్గొని, ఎన్జీవోలు స్థాపించారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలు ప్రారంభించారు. ఒకరు సీఎం అయ్యారు, మరొకరు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు.. ఒకరు ఇవాళ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మరొకరు లోక్‌సత్తా పార్టీ అధినేత జయ ప్రకాష్ నారాయణ(జేపీ).
ఆలిండియా ఐఏఎస్ ర్యాంకర్.. జేపీ
ఆలిండియా ఐఏఎస్ పరీక్షలో నాల్గో ర్యాంకు సాధించిన జేపీ. పాలనా విభాగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో సేవలందించారు. విశాఖపట్టణం జాయింట్ కలెక్టర్‌గా, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల కలెక్టర్‌గానూ పని చేశారు. గవర్నర్ కృష్ణకాంత్, ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కు కార్యదర్శిగా పని చేశారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ 2014, విజిలెన్స్ అడ్వైసరీ కౌన్సిల్ ప్యానెల్‌లో ఆయన పనిచేశారు. ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించారు. 1996లోనే ప్రజాస్వామ్యంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ‘లోక్ సత్తా’ పేరిట ఎన్జీవో స్థాపించాడు. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ స్థాపించారు. అక్టోబర్ 2, 2006లో లోక్‌సత్తా పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో 246 స్థానాల్లో లోక్‌సత్తా పోటీ చేయగా 1.80 శాతం ఓటింగ్ వచ్చింది. కేవలం లోక్‌సత్తా అధినేత జేపీ మాత్రమే కూకట్‌పల్లి నుంచి గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో దేశంలోని అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2016లో లోక్‌సత్తా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోదని జేపీ ప్రకటించారు. ఆ ప్రకటనతో జేపీ రాజకీయం నుంచి నిష్క్రమించినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, టీవీ డిబేట్‌ల్లో తరుచూ పాల్గొంటున్న జేపీ మాత్రం లోక్‌సత్తా ఆశయాలు నెరవేరాయనీ, లోక్‌సత్తా కృషి వల్లే ఆర్టీఐ చట్టం వచ్చిందని, లోక్ పాల్, 97, 99 రాజ్యాంగ సవరణలు జరిగాయని చెబుతున్నారు.
ఐఆర్ఎస్.. కేజ్రీ..
ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్) అరవింద్ కేజ్రీవాల్ ఐఐటీ ఖరగ్‌పూర్ మెకానికల్ ఇంజనీర్. ఐఆర్‌ఎస్ కాక ముందు టాటా స్టీల్ కంపెనీలో పనిచేశాడు. ఐఆర్ఎస్ అధికారిగా ఉంటూనే అరవింద్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1999లో పరివర్తన్ అనే ఎన్జీవో సంస్థను స్థాపించి సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేసేందుకు కృషి చేశారు. అన్నాహజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2012లో ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) స్థాపించాడు. 2013లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎంగా పని చేశారు. రాజీనామా చేసి 2015 ఎన్నికల్లో బరిలో దిగి రికార్డుస్థాయిలో 70కి 67 స్థానాలు గెలుచుకున్నారు. తాజాగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 70కి 62 స్థానాల్లో ఆప్(చీపురు) ఘన విజయం సాధించింది. ఆదివారం ఆయన సీఎంగా ప్రమాణం చేశారు.
ఇరువురి పార్టీల నిర్మాణాలు పరిశీలిద్దాం.. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చిన కేజ్రీవాల్ పార్టీకి కార్యకర్తలే బలం. ఆప్ సంస్థాగత నిర్మాణం కోసం కేజ్రీవాల్ బలంగా కృషి చేశారు. కొందరు నాయకులు ఆప్ నుంచి వెళ్లిపోయినప్పటికీ కేజ్రీవాల్ బలంగా కార్యకర్తలను అంటిపెట్టుకుని కార్యక్రమాలు చేశారు. ఢిల్లీ సీఎంగా ఉండి మరీ, లెఫ్టినెంట్ గవర్నర్ వైఖరి పట్ల నిరసన తెలిపారు. రోడ్డు మీదకొచ్చారు. నాయకత్వ లోపం లేకుండా అరవింద్ ఎప్పటికప్పుడూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కార్యకర్తలకు తానే నాయకుడననీ, వారికి కష్టం వస్తే కాపు కాస్తానని అభిప్రాయం బలంగా చేతల్లో చూపించారు అరవింద్. ఆప్‌ను కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా పంజాబ్, హర్యానా మిగతా రాష్ట్రాల్లో విస్తరింపచేశారు. పంజాబ్‌లో ఆప్‌కు గణనీయమైన ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో ఆప్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకుంది. అంతేగాకుండా ఒకసారి అధికారంలోకొచ్చిన తర్వాత విద్య, వైద్యం, రవాణా వంటి అంశాలకు ప్రాధాన్యతిచ్చి అభివృద్ధి ఎలా చేయాలో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు.
లోక్‌సత్తా పార్టీ సంస్థాగత నిర్మాణం పట్ల జేపీ అంతగా కృషి చేయలేదు. పైగా నాయకత్వం కేవలం జేపీ మాత్రమే. జిల్లాల్లో నాయకులు లేరు. అంతేగాకుండా పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు జేపీ ఎక్కడా కృషి చేయలేదనే తెలుస్తోంది. వీటన్నింటికి తోడు రాజకీయంలో గెలుపు ముఖ్యం కాబట్టి అందుకు ప్రచారం చేయడంలో జేపీ పూర్తిగా సహకరించలేదని అందుకే లోక్‌సత్తా అభ్యర్థులు గెలవలేకపోయారని పలువురు అప్పట్లో ఆరోపించారు. జేపీ కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండేవారు కాదనీ, సంస్కరణల పట్ల ఎప్పుడూ మాట్లాడేవారని లోక్ సత్తా కార్యకర్తలు చెబుతారు.
ఎవరికి వారే..
అరవింద్ కేజ్రీవాల్, జేపీ.. ఇద్దరూ ఉన్నతాధికారులే కానీ, వారి, వారి పనివిధానం వల్లే ఒకరు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారనీ, మరొకరు మళ్లీ సీఎం కాగలిగారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మార్పునకు రాజకీయ అధికారం తప్పనిసరి అని బలంగా భావించారని, అందుకే వారణాసిలో సైతం మోడీపై పోటీ చేయడం గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు. జేపీ మాత్రం వ్యవస్థలో లోపాలు చూపారు కానీ, దానికి కారణం ఎవరో చెప్పలేదని అందుకే లోక్‌సత్తా ఎన్నికల పర్వంలో తన పాత్రను పోషించలేక పరాజయం పాలైందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.