- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టుల్లో ట్విస్టు.. ఆ ముగ్గురిలో ఎవరు కరెక్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: “కరోనా లక్షణాలు కనిపించగానే టెస్టులు చేయించుకోడానికి పరుగెత్తాల్సిన అవసరం లేదు. రెండు రోజుల తర్వాత కూడా తగ్గపోతే అప్పుడు టెస్టులకు వెళ్ళొచ్చు. టెస్టింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టడం ద్వారా ఇన్‌ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది’’ – డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, ప్రజారోగ్య శాఖ
“కరోనా బారిన పడుతున్నవారిలో దాదాపు 90 శాతం మందికి లక్షణాలే ఉండడంలేదు. టెస్టులు చేయించుకోకపోవడం వలన కొంతమంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఇన్‌ఫెక్షన్ రేటును లెక్కించడానికి డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేసి రక్తపరీక్షలు చేస్తా’’
– ఈటల రాజేందర్, రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి
“టెస్టింగ్-ట్రేసింగ్-ట్రీటింగ్ విధానమే ఇప్పటికీ ఉత్తమమైనది. టెస్టులు చేయించుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే వైరస్‌ను గుర్తించి ఇతరులకు వ్యాపించకుండా చూసుకోడానికి వీలవుతుంది. వ్యాధి ముదిరేదాకా టెస్టులు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు’’
– లవ్ అగర్వాల్, కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
కరోనా కట్టడి కోసం మూడు స్థాయిల్లోని వ్యక్తులు మూడు రకాలుగా చెప్తున్నారు. టెస్టుల్లో ఈ కొత్త ట్విస్టు ఏంటో అర్థం కావడంలేదు. ఇందులో ఏది పాటించాలో తేల్చుకోవడం ప్రజల వంతయింది. రాష్ట్రంలో తొలి వేవ్ సందర్భంగా విస్తృతంగా టెస్టులు చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సెకండ్ వేవ్ సమయంలో మాత్రం ఆ ఉత్సాహాన్ని ప్రదర్శించడంలేదు. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్చి నెలలో టెస్టులు చేయించుకోవాల్సిందిగా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కానీ గత రెండు వారాలుగా టెస్టింగ్ కేంద్రాల దగ్గర వేలాది మంది క్యూ కడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ కిట్లకు కొరత ఏర్పడింది. తొలుత ఎన్ని టెస్టులైనా చేయడానికి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత రోజుకు గరిష్టంగా 300 టెస్టుల సీలింగ్ విధించింది. ఆ తర్వాత దీన్ని వంద టెస్టులకు కుదించింది. ఇప్పుడు అరవై టెస్టులకే పరిమితం చేసింది. కొన్ని చోట్ల అసలు టెస్టులు చేయడానికి కిట్లు కూడా లేవు. సిబ్బంది కొరత సరేసరి. టెస్టులు చేయించుకుందామని వెళ్ళిన ప్రజలు వారికి తెలియకుండానే ఇంకొకరికి అంటిస్తున్నారు. ఒక సెంటర్‌లో కిట్లు లేకపోవడంతో మరో సెంటర్‌కు పరుగులు తీస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి మరింత విస్తృతమవుతోంది. ప్రభుత్వమే వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతోంది.
ఇదిలా ఉంటే రాపిడ్ టెస్టులు చేయించుకున్నవారికి మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్‌లు రావడంలేదు. మౌఖికంగానే నెగెటివ్, పాజిటివ్ అంటూ చెప్పేస్తున్నారు. కొంతమందికి పేర్లు నమోదు చేయించుకున్నా టెస్ట్ చేయించుకోకముందే ఎస్ఎంఎస్ ద్వారా రిపోర్టు వచ్చేస్తోంది. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకున్న మరికొద్దిమందికి 24 గంటల్లో రావాల్సిన రిపోర్టు వారం రోజులైనా రావడంలేదు. దీంతో వారికి పాజిటివ్ ఉందో లేక నెగెటివ్ ఉందో తెలియడంలేదు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఇంట్లోనివారికీ, బైట తిరిగినప్పుడు పక్కనున్నవారికీ తెలియకుండానే వైరస్‌ను అంటిస్తున్నారు.
టెస్టింగ్ కిట్లకే కాదు… వ్యాక్సిన్లకూ కొరత ఏర్పడింది. జనం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. టెస్టింగ్ కిట్ల కొరతను దృష్టిలో పెట్టుకున్న వైద్యారోగ్య శాఖ అధికారులు “టెస్టులు చేయించుకోడానికి తొందరపడాల్సిన పనిలేదు. రెండు రోజులకు కూడా లక్షణాలు తగ్గకపోతే అప్పుడు చేయించుకోవచ్చు’’ అని సెలవిస్తున్నారు. మార్గదర్శకాల్లో మార్పులు చేశారా లేక కిట్లకు కొరత ఉండడంతో ఇలా చెప్పాల్సి వచ్చిందా అనే సందేహాలు నెలకొన్నాయి. ఏ వైరస్‌ను వ్యాప్తి కాకుండా నివారించాలని ప్రభుత్వం భావిస్తూ ఉందో అది అవలంబిస్తున్న విధానాలతో మరింత విస్తృతంగా వ్యాపిస్తోంది. పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నవారిలో దాదాపు 90% మంది ఎలాంటి లక్షణాలు లేనివారే అంటూ మంత్రి ఈటల రాజేందర్, డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పదేపదే చెప్తున్నారు. కానీ పరీక్షలు చేయించుకోకపోతే వారికి తెలియకుండానే ఇతరులకు అంటించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయనే సందేహాలకు ప్రభుత్వం నుంచి జవాబు లేదు.
నిజానికి టెస్టులు చేయించుకోడానికి సెంటర్లకు వెళ్ళే ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, అక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ సెంటర్లే వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారాయి. కేంద్ర వైద్యారోగ్య శాఖ సైతం ఒక దశలో “ఒక వ్యక్తి 46 మందికి వైరస్‌ను అంటిస్తున్నారు“ అని ఇటీవల కామెంట్ చేయాల్సి వచ్చింది. తొలి వేవ్‌లో సమృద్ధిగా కరోనా టెస్టింగ్ కిట్లను సమకూర్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు కొరతగా ఉన్న ఎందుకు సమకూర్చుకోలేకపోతోందనే ప్రశ్నలకు అధికారుల నుంచి, మంత్రి నుంచి సమాధానం కరువైంది. గతేడాదితో పోలిస్తే టెస్టింగ్ కిట్లకు మార్కెట్‌లో ధర రెట్టింపు కావడం వలన ఆర్థిక భారం నుంచి తప్పించుకోడానికి కిట్ల కొనుగోలును తగ్గించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.