అన్ని దారులూ తుంగభద్రవైపే..

by Shyam |
అన్ని దారులూ తుంగభద్రవైపే..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: అత్యంత పవిత్ర స్నానంగా భావించే పుష్కర స్నానాన్ని ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుండి తుగభద్రకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, వేణిసోంపురం, రాజోళి, పుల్లూరు నాలుగు పుష్కరఘాట్లు గడిచిన మూడు రోజులగా భక్తుల రద్దీతో నిండిపోతున్నాయి. నవంబర్ 20వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు డిసెంబర్ 1వ తేదీతో ముగియనున్నాయి. పుష్కరాల ప్రారంభంలో తుపాన్ కారణంగా చల్లటి గాలులు వీయడంతో భక్తుల సంఖ్య తక్కువగా కనిపించింది. కానీ గత చివరి మూడు, నాలుగు రోజుల నుండి అన్నిపుష్కర ఘాట్ల వద్ద భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటివరకు పుష్కరాలకు మొత్తం 3,53,787 మంది రాగా, సోమవారం ఒక్క రోజే 1,15,470 మంది వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 4 పుష్కారా ఘాట్లకు సంబంధించి అలంపూర్‌లో 1,78,041 మంది, పుల్లూరులో 65,440 మంది, రాజోలిలో 81,488మంది, వేణిసోంపురంలో 28,878 మంది పుష్కర స్నానాలు ఆచారించినట్లు వెల్లడించారు.

సమస్యల్లేకుండా.. సౌకర్యవంతంగా…

రూ.2.5కోట్లతో భక్తుల సౌకర్యార్థం కొవిడ్ నిబంధనల ప్రకారమే భక్తులు స్నానాలు ఆచరించేలా, పూజలు నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా, జిల్లా ఎస్పీ.రంజన్ రతన్ కుమార్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తూ పలు సలహాలు, సూచనలు చేశారు. భక్తులకు సహాయసహకారాలు అందించేందుకు మొత్తం 2435మంది సిబ్బందిని అందుబుటులో ఉంచారు. రెవెన్యూ, పురపాలిక, పోలీసు, వైద్యఆరోగ్య, దేవాదాయశాఖ, విద్యుత్తు శాఖ, అగ్నిమాపకశాఖ ఉద్యోగులతోపాటు గజ ఈతగాళ్లు ఘాట్ల వద్ద విధులు నిర్వహించారు.

పోలీసుల సేవలకు ప్రశంసలు

పుష్కరాలలో భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిపై భక్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జోగులలాంబ గద్వాల జిల్లాలో పుష్కరాలు జరిగే అలంపూర్, పుల్లూర్, రాజోలి, వేణిసోంపురం పుష్కర ఘాట్లలో, ప్రధాన రహదారులపై పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సుమారు 2,300 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో భద్రత ఏర్పాట్లను చేశారు.

Next Story

Most Viewed