నోడల్ అధికారిగా ‘సందీప్ సుల్తానియా’

by Shyam |   ( Updated:2020-04-29 11:26:08.0  )
నోడల్ అధికారిగా ‘సందీప్ సుల్తానియా’
X

దిశ, న్యూస్ బ్యూరో : రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతించడంతో తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. ప్రస్తుతం పంచాయతీరాజ్ కార్యదర్శిగా ఉన్న సందీప్ సుల్తానియా, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్న జితేందర్‌ను వలస కార్మికుల రాకపోకలను పర్యవేక్షించే నోడల్ అధికారులుగా ప్రకటిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికంగా ఉండే అధికారులు.. వీరితో సమన్వయం చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన మార్గదర్శకాల వెలుగులో వలస కార్మికుల రాకపోకల విషయంలో తగిన ప్రోటోకాల్ నిబంధనలను పాటిస్తారని తెలిపారు.

తొమ్మిది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు సంగారెడ్డి జిల్లా, కంది గ్రామంలో హైదరాబాద్ ఐఐటీ భవన నిర్మాణ పనుల నిమిత్తం వచ్చి, కాంట్రాక్టు సంస్థల నుంచి వేతనాలు అందుకోలేక, వసతి సౌకర్యాలు, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ బుధవారం ఉదయం రోడ్డెక్కారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య దాడులు జరిగాయి. స్వస్థలాలకు వెళ్ళేందుకు అనుమతివ్వాలని పోలీసులను డిమాండ్ చేయడంతో గురువారం సాయంత్రంకల్లా సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ సమయంలోనే కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వీరి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.

Tags: Telangana, Stranded Migrant labours, CS meeting, Nodal Officers

Advertisement

Next Story

Most Viewed