కరోనాపై అపోహలు.. నిజాలు..

by sudharani |   ( Updated:2020-03-27 04:17:22.0  )
కరోనాపై అపోహలు.. నిజాలు..
X

కరోనాపై రకరకాల వార్తలు, సమాచారంతో పాటు.. కరోనా వ్యాప్తి, ప్రభావం గురించి సోషల్ మీడియాలో చాలా అసత్యాలు ప్రచారం అవుతున్నాయి. అందులో ఏది నిజమో, ఏది కాదో నెటిజన్లు, ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. వీటిలో నిజానిజాలపై అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరికొన్ని ఆరోగ్య సంస్థలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా కరోనాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి అధీకృత సమాచారాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాయి.

పిల్లలకు, యువకులకు కరోనా రాదా ?

కరోనా ఎవరినీ వదిలి పెట్టదు. కరోనా అన్ని వయసుల వారికి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ చాలా మంది యువకులకు రాదనే అపోహలో ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లోనే కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో పిల్లలకు కరోనా రాదనే అపోహ చాలామందిలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా కరోనావైరస్‌ సోకే అవకాశం ఉంది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన మూడేల్ల పిల్లకు కరోనా సోకింది. అలానే ఇటలీలో కరోనా వచ్చిన వాళ్లలో యువకులే ఎక్కువ. చిన్నారులకు కరోనా వస్తే.. రెండు మూడు రోజుల్లోనే తెలిసి పోతుంది. అదే యువకులకు వస్తే.. పది నుంచి 14 రోజులు పట్టొచ్చు. కొంతమందిలో 20 రోజులైనా కూడా లక్షణాలు కనిపించకపోవచ్చు.

వేడి ప్రాంతాల్లో కరోనా వస్తుందా ?

ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల్లో కరోనా ప్రభావం పెద్దగా ఉండదని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే చోట కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా ఉంటుందని మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొవిడ్‌-19 సోకినవారి సంఖ్యను.. ఆయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, గాలిలో తేమ (ఆర్ద్రత) ఎంత మేరకు ఉన్నాయనే అంశంతో ఎంఐటీ పరిశోధకులు పోల్చిచూశారు. వారి అధ్యయనం ప్రకారం.. 3 నుంచి 17 డిగ్రీల సెల్సియస్‌ దాకా ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లోనే కొవిడ్‌-19 వ్యాప్తి జరిగినట్టు తేలింది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడమే కాదు.. ఆయా ప్రాంతాల్లో గాలిలో తేమ కూడా క్యూబిక్‌ మీటరుకు 4-9 గ్రాములుగా ఉన్నట్టు వెల్లడైంది. అదే సమయంలో.. సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు మించి ఉండి, జనవరి, ఫిబ్రవరి నెలల్లో, మార్చి మొదటివారంలో ఆర్ద్రత ఘనపు మీటరుకు 9 గ్రాముల కన్నా ఎక్కువగా ఉన్న చోట్ల కరోనా ఇన్ఫెక్షన్లు కేవలం 6 శాతం నమోదయినట్టు తేలింది. ఈ నేపథ్యంలో.. రుతుపవనాలు ఉండే ఆసియాన్‌ దేశాల్లో గాలిలో తేమ ఘనపు మీటరుకు 10 గ్రాముల కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని వారు విశ్లేషించారు.

కన్నీటి నుంచి కరోనా వస్తుందా ?

‘కరోనా గాలిలో వ్యాపించే వైరస్‌ కాదు.. డ్రాప్‌లెట్‌ వైరస్‌. అంటే తుమ్ము, దగ్గు తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది’.. అని వైద్యులు చెబుతున్నారు. మరి డ్రాప్‌లెట్‌ వైరస్‌ అంటే కన్నీటి ద్వారా వ్యాపిస్తుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. సింగపూర్‌కు చెందిన శాస్త్రజ్ఞులు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కరోనా సోకినవారి కన్నీరు మన మీద పడినా.. దాన్నుంచి వైరస్‌ వ్యాపించదని, ఆ నీటిలో వైరస్‌ ఉండదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షన్‌ డిసీజెస్‌ పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో భాగంగా వారు కొవిడ్‌-19 బారిన పడిన 17 మంది కన్నీటి చుక్కలను వారికి నయమయ్యే దాకా రోజూ సేకరించి పరీక్షించారు. రోగుల ముక్కు, నోటి స్రావాల్లో ఉన్న వైరస్‌.. వారి అశ్రువుల్లో మాత్రం లేదని వారి పరీక్షల్లో తేలింది.

ఆపకుండా గాలి పీల్చితే..

పది సెకన్ల పాటు. . ఆపకుండా శ్వాస పీల్చుకుంటే.. కరోనా రాదని చాలా మంది భావిస్తున్నారు. కరోనా గురించి ఇది మరో అపోహ. ఆన్‌లైన్‌లో ఇలాంటి టెస్ట్‌లు ప్రచారంలో ఉన్నాయి. కరోనా / కోవిడ్‌ చెకర్‌ల పేరుతో వెబ్‌సైట్లలో వీటిని పెడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారిని గుర్తించడానికి ఇలాంటివి కొంతవరకు ఉపయోగపడొచ్చు. అంతేకానీ ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. అయితే ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే.

నిమ్మరసం, అల్లం వేడి నీళ్లు తాగితే :

నిమ్మరసం, అల్లం రోగ నిరోధక శక్తి పెంచుతుందని, వాటిని వేడి నీళ్లల్లో వేసుకుని కాస్త ఉప్పు వేసుకుని తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందనే అపోహ ప్రచారంలో ఉంది. అంతేకాదు.. ప్రతి 15 నిమిషాలకోసారి వేడి నీళ్లు తాగితే వైరస్‌ గొంతులో నుంచి కడుపులోకి పోతుందని, తర్వాత కడుపులో యాసిడ్‌ల వల్ల అది చనిపోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ అపోహలు మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Tags : CORONA VIRUS, COVID 19, LEMON, GINGER, HOT WATER, YOUTH , CHILDREN, CLIMATE

Advertisement

Next Story

Most Viewed