- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్-1బీ వీసాలపై నిషేధం.. భారతీయ నిపుణులపై ప్రభావం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ వలస విధానంలో పెను మార్పులు తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఇందులో భాగంగా హెచ్1బీ వీసాల జారీలో సంస్కరణలకు తెరలేపారు. ఈ ఏడాది చివరి వరకు హెచ్1బీ వీసాల జారీపై నిషేధం విధించారు. ఈ మేరకు తన పరిపాలనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై హెచ్1బీ వీసాల జారీలో ‘లాటరీ’ పద్ధతి కాకుండా ‘ప్రతిభ ఆధారంగా’ వీసాలు జారీ చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా, అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులకు మాత్రమే వీసాలు అందేలా చర్యలు తీసుకోబోతున్నట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త విధానంలో కేవలం అత్యధిక వేతనాలు పొందే విదేశీయులకు వీసాలు ఇవ్వడం వల్ల, తక్కువ వేతనాల ఉద్యోగాలు విదేశీయులకు కాకుండా అమెరికన్లకే దక్కుతాయని భావిస్తున్నారు.
ఎలా జారీ చేస్తారు..
గతంలో హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేస్తుకున్న వాళ్ల పేర్లను లాటరీ తీసి వీసా కేటాయించే వాళ్లు. ఇందులో ప్రతిభ అంటూ ఏం ఉండదు. అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు లాటరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. ప్రతి ఏడాదీ వచ్చే దరఖాస్తుల్లో అత్యధిక వేతనం కలిగిన వారికే వీసాలు కేటాయిస్తారు. ఏడాదికి 85 వేల హెచ్1బీ వీసాలు అమెరికా జారీ చేస్తోంది. గతేడాది 2,25,000 దరఖాస్తులు వచ్చాయి. కొత్త విధానంలో ఈ 2,25,000 దరఖాస్తుల్లో అత్యధిక వేతనం ఉన్న 85 వేల మందికి వీసాలు దక్కుతాయి. దీనివల్ల నిపుణులు మాత్రమే దేశంలో పని చేయడానికి వీలుకలుగుతుందని అధికారులు అంటున్నారు. ఇకపై అత్యధిక వేతనం ఉన్న అమెరికన్లను తొలగించి చౌకగా దొరికే విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునే వీలుండదని చెబుతున్నారు.
ఇండియా, చైనాలపై ప్రభావం
అమెరికాలో ఉద్యోగాల నిమిత్తం అత్యధికంగా హెచ్1బీ వీసాలు పొందేది ఇండియా, చైనా దేశాలకు చెందిన వాళ్లే. 2020-21 ఆర్థిక సంవత్సరానికి (అమెరికాలో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది) గానూ హెచ్1బీ వీసాల లాటరీ పూర్తయ్యింది. ఉద్యోగులను స్పాన్సర్ చేస్తున్న అమెరికన్ కంపెనీలు తమ దరఖాస్తులను జూన్ చివరి నాటికల్లా సమర్పించాల్సి ఉంది. ప్రీమియం కేటగిరీకి సంబంధించిన హెచ్1బీ దరఖాస్తుల ప్రక్రియ మాత్రం జూన్ ఆఖరి వారంలో ప్రారంభం కానుంది. వీరందికీ లాటరీ పద్ధతిలో వీసాలు దొరికినా ప్రస్తుతం నిషేధం విధించిన నేపథ్యంలో స్టాంపింగ్ పడదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం బ్యాన్ ఎత్తివేసిన తర్వాతే ఈ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాగా, ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా ఇండియా, చైనాల నుంచే అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ ఏడాది చివరి వరకు వీరంతా వేచి చూడాల్సిందే. ఇప్పటికే అమెరికాలో పని చేస్తున్న భారతీయ ఉద్యోగుల వీసా పునరుద్ధరణకు కూడా సమయం పట్టనుంది. అయితే, ట్రంప్ నిర్ణయం వల్ల అధిక వేతనం పొందుతున్న భారతీయ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరోవైపు అమెరికన్లకు కూడా స్థానిక ఉద్యోగాల్లో పోటీ తగ్గనుంది. కాకపోతే ఇకపై చౌక వేతనాలకు అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు మాత్రం వీసా రావడం కష్టమే.
వీరికి ఎలాంటి సమస్యా లేదు
హెచ్1బీ వీసాలపై నిషేధం నేపథ్యంలో కొత్త వీసాల జారీకి ఆలస్యం అవుతుంది. కానీ, ఇప్పటికే చెల్లుబాటులో ఉన్న వీసాలు కలిగి ఉన్నవారు, అమెరికా ట్రావెల్ అనుమతి ఉన్నవారికి ఎలాంటి సమస్యా ఉండదని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా హెచ్1బీ వీసా కల్గి అమెరికా వెలుపల చిక్కుకొని పోయిన వారికి కూడా సమస్యలు ఎదురుకాబోవు. అమెరికాలో స్టూడెంట్ వీసాపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ వీసాను వర్క్ పర్మిట్‌గా మార్చుకోవడానికి కూడా ఇబ్బంది లేదు. హెచ్1బీ వీసా కలిగి ఎల్1 వీసా (కంపెనీ మార్పు కోసం) కావాలనుకున్నా అధికారులు జారీ చేస్తారు. అలాగే, హెచ్1బీ వీసా డిపెండెంట్లకు జారీ చేసే వీసాల కోసం మాత్రం డిసెంబర్ నెలాఖరు వరకు వేచి చూడాల్సి ఉంటుంది.