లాక్‌డౌన్ ఎత్తేస్తే మరణాలు పెరుగుతాయి : ట్రంప్

by  |
లాక్‌డౌన్ ఎత్తేస్తే మరణాలు పెరుగుతాయి : ట్రంప్
X

వాషింగ్టన్ : కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే సరైన పరిష్కారమని.. వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంతగా నియంత్రిస్తే నష్టాన్ని తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ చాలా దేశాలు డబ్ల్యూహెచ్‌వో మాటలను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడానికే మొగ్గు చూపుతున్నారు. పలు రాష్ట్రాల గవర్నర్లకు లాక్‌డౌన్ సడలించాలని స్వయంగా చెప్పారు. లాక్‌డౌన్ ఎత్తేయాలని చేసిన ఆందోళనలకు ట్రంప్ మద్దతు కూడా తెలిపారు. ఇలా లాక్‌డౌన్ ఎత్తేసి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని భావిస్తున్న ట్రంప్ అకస్మాత్తుగా మాట మార్చారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తే వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంటుందని.. మరణాలు కూడా పెరుగుతాయని చెప్పారు. ఫీనిక్స్‌లో ఒక మాస్కుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఆంక్షలు సడలించిన తర్వాత మరణాలు భారీ సంఖ్యలోనే పెరిగే అవకాశం ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టడానికి తప్పడం లేదన్నారు. అమెరికాలో మరణాల సంఖ్య లక్ష దాటుతుందని ట్రంప్ చెప్పారు. వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు తెలియడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత తొలిసారిగా వైట్ హౌస్ వదలి బయటకు వచ్చారు కదా.. మరి మాస్క్ ఎందుకు ధరించలేదని విలేకరులు ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో కరోనా ప్రభావం లేదని.. ఇక్కడ మాస్కు ధరించకపోయినా ఏమీ కాదని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా అక్కడికి వచ్చిన విలేకరులను మాత్రం ఫ్యాక్టరీ యాజమాన్యం మాస్కులు ధరించమని బలవంతపెట్టడం గమనార్హం.

Tags : Donald Trump, Lockdown, Restrictions, Releif, Deaths, USA

Next Story

Most Viewed