టీఆర్ఎస్ @ టార్గెట్ హుజురాబాద్.. ఓటర్లకు భారీ ఆఫర్లు..!

by Anukaran |   ( Updated:2021-07-24 10:50:19.0  )
టీఆర్ఎస్ @ టార్గెట్ హుజురాబాద్.. ఓటర్లకు భారీ ఆఫర్లు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీకి హుజురాబాద్​ టార్గెట్ అయింది. ఇప్పుడు రాష్ట్రమంతా అబ్బురపడేలా హుజురాబాద్‌కు వరాలు ప్రకటిస్తున్నారు. నిధులు, నియామకాలు అటువైపు పరుగులు పెడుతున్నాయి. “ మా నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక వస్తే బాగుండు” అనే తీరులో అనుకునేలా ఆపరేషన్​ హుజురాబాద్​ నడుస్తోంది. ఇదే వేదికగా కొత్త పథకం రూపుదిద్దుకుంది. దాదాపు 40వేల పైచిలుకు ఉన్న దళిత ఓట్లు గంపగుత్తగా తమవైపు తిప్పుకునేలా గులాబీ బాస్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఇదే కాకుండా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన పథకాలన్నీ మళ్లీ ఇక్కడి నుంచే మొదలవుతున్నాయి.

పింఛన్ల నుంచి పంచాయతీ భవనాల వరకు

2018 నుంచి రాష్ట్రంలో ఆపేసిన కొత్త పింఛన్ల మంజూరు హుజురాబాద్​సెగ్మెంట్‌కు మాత్రం ఇప్పుడు ప్రారంభమైంది. కరీంనగర్​జిల్లాలోని హుజురాబాద్​సెగ్మెంట్‌లోని ప్రతి గ్రామానికి 10 నుంచి 28 కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఇక ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టి, హామీ ఇచ్చిన 57 ఏండ్ల పింఛన్​ కూడా హుజురాబాద్​ వేదికగా పట్టాలెక్కుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో 57 ఏండ్ల పింఛన్‌కు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలంటూ రెండు రోజుల కిందటే కరీంనగర్​ కలెక్టర్​ఆదేశాలిచ్చారు. అటు దళిత బంధు కూడా అక్కడి నుంచే మొదలుకానుంది. దీనిపై రేపు సీఎం కేసీఆర్​హుజురాబాద్​నియోజకవర్గానికి చెందిన దళితులతో ప్రగతిభవన్‌లో సమావేశం కానున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఈ సెగ్మెంట్‌లోని నాలుగు మండలాలకు ఉపాధి హామీ నిధుల నుంచి సీసీరోడ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లకు మంజూరు ఇవ్వకున్నా ఇక్కడ మాత్రం నిబంధనలను సడలించుకున్నారు. దీంతో జమ్మికుంట మండలానికి రూ. 5.44 కోట్లు, హుజురాబాద్ మండలానికి రూ. 2.47 కోట్లు, ఇల్లందకుంట మండలానికి రూ. 1.50 కోట్లు, వీణవంక మండలానికి రూ. 30.0 కోట్లను మొత్తం 64 గ్రామాలకు విడుదల చేశారు. అయితే నిధుల మంజూరిలో కూడా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పట్టు ఉండే ప్రాంతాలకే ప్రయారిటీ ఇస్తున్నారు.

అదే విధంగా రెండేండ్ల నుంచి గ్రామ పంచాయతీ భవనాలకు పైసా ఇవ్వని ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం కాసుల వరద కురిపిస్తోంది. గ్రామ పంచాయతీ సొంత భవనాల నిర్మాణానికి ఉపాధి నిధులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల నిధులను వినియోగిస్తోంది. ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు, మంత్రుల సీడీపీ నుంచి రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు అదనంగా గ్రామాలకు మంజూరు చేస్తున్నారు.

కుల సంఘాలకు కూడా..

ప్రస్తుతం హుజురాబాద్​నియోజకవర్గంలోని కుల సంఘాలకు చాలా పెద్దపీట వేస్తున్నారు. కుల సంఘాల ప్రతినిధులను పిలిపించుకుని గ్రామాలు, మండలాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. శనివారం కూడా రజక సంఘం నాయకులతో సమావేశమై వారికి హుజురాబాద్‌లో కుల సంఘం భవన నిర్మాణానికి భూమిని ఇస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాణం కోసం నిధులు కూడా సమకూరుస్తున్నారు. అన్ని కులాలకు ఇదే ప్రాతిపదికన ఇస్తూ మద్దతు కూడబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కేడర్​పై ఫోకస్​

ఇదిలా ఉంటే నియోజకవర్గంలో మొన్నటిదాకా ఈటల వెంట తిరిగిన గ్రామస్థాయి నేతల నుంచి మొదలుకుని సీనియర్ల దాకా గులాబీ దళంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికోసం ప్రత్యేకంగా మంత్రుల బృందమే రంగంలోకి దిగింది. ఇప్పటికే సీనియర్లను, హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌లోనే ఉండేలా కట్టుదిట్టం చేశారు. ప్రలోభాలో, భయమో కానీ మొత్తానికి గులాబీ కండువా వీడమంటూ తిరుగుతున్నారు. ఇలా ప్రతి అంశాన్ని గులాబీ దళం అనుకూలంగా మల్చుకునేందుకు హుజురాబాద్‌లో తాపత్రయం పడుతోంది.

నియామకాలు కూడా..

నిజానికి హుజురాబాద్‌లో 40వేల పైచిలుకు ద‌ళిత ఓట్లు అన్నీ టీఆర్ఎస్​ ఖాతాలో ఉండాలని కేసీఆర్ వ్యూహాత్మక ప్లాన్​వేస్తున్నారు. అందుకే ఈట‌ల వ‌ర్గంగా ముద్రప‌డి, కీల‌క అనుచ‌రుడిగా ఉన్న బండా శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పోరేష‌న్ ప‌ద‌వి క‌ట్టబెట్టారు. వాస్తవంగా ఇప్పటి వరకూ బండా శ్రీనివాస్​పేరు కార్పొరేషన్​పదవుల్లో ఎక్కడా కనిపించలేదు. ఆశించిన దాఖలాలు కూడా లేవు. కానీ ఎస్సీ కార్పొరేషన్​చైర్మన్​ఇచ్చారు. కానీ ఆయనకు ఏడాది కాలం మాత్రమే ఇచ్చారు. మాములుగా రాష్ట్రస్థాయి కార్పోరేష‌న్ ప‌ద‌వులు ఎవ‌రికి ఇచ్చినా రెండు సంవ‌త్సరాల టెన్యూర్ పెడ‌తారు. ఇక్కడ ఏడాది మాత్రమే ఇచ్చారంటేనే ఈ ఎన్నిక‌ల కోసం అని స్పష్టంగా అర్థమవుతోంది. ద‌ళితుల ఓట్లు వ‌న్ సైడ్ ప‌డే అవ‌కాశం లేదనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టి ఇప్పటికే మండలాల వారిగా పార్టీ ఇన్‌చార్జీలను నియమించింది. గ్రామాల్లో కూడా ఇన్‌చార్జీలు ఉన్నారు. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు కూడా నియెజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూనే ఉన్నారు. ఉప ఎన్నిక షెడ్యూలు వచ్చే నాటికి నియెజకవర్గంలో ఈటల వర్గం లేకుండా చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ప్రధానంగా నియెజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాలపై లోతుగా అధ్యయనం చేసి.. ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఆయా సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు వేగంగా పావులు కదుపుతోంది టీఆర్ఎస్. పార్టీలోకి చేరికలు కూడా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. హుజురాబాద్ నియెజకవర్గంలో ప్రధానంగా నాలుగైదు సామాజిక వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు పాట్లు పడుతున్నారు.

గతంలోనూ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా సామాజిక సమీకరణాలపై నజర్ పెట్టి అక్కడ గెలుపొందిన గులాబీ పార్టీ తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికకు కూడా అటువంటి ఫార్ములాతోనే వస్తుందని పార్టీ నేతలే చెప్పుతున్నారు. ఇంకా నోటిఫికేషన్​రాకున్నా.. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్‌కు అభ్యర్థి ఖరారు కాకున్నా… ఇక్కడ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇటు ఓటర్లకు గాలం వేసేందుకు కానుకల పంపిణీ కూడా జోరుగానే సాగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాల్లో కూడా ముందుంటున్నారు. అధికార పార్టీ కాబట్టి… ఈ ప్రలోభాలను అధికారికంగానే చూపించుకుంటోంది. గ్రామ, మండలాల పరిధిలో అధికార పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్​ నేతలకు కూడా గ్రామాల వారీగా లిస్టులు తయారుచేసుకుని కానుకలు పంపుతున్నారని టాక్.

Advertisement

Next Story

Most Viewed