హుజూరాబాద్‌పై స్వరం మార్చిన టీఆర్ఎస్.. ఆ భయమే కారణమా..?

by Anukaran |   ( Updated:2021-08-24 23:24:05.0  )
KCR KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తమకు లెక్కే కాదని, చాలా చిన్న విషయమంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. కానీ గత నెల రోజులకు పైగా టీఆర్ఎస్ రాజకీయాలు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు మాత్రం హుజూరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. కేటీఆర్ మాటలకు, కేసీఆర్ చేతలకు మధ్య వైరుధ్యం కనిపిస్తోంది. సరిగ్గా ఈ విషయాలనే విపక్షాలు ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నాయి. నిజంగా హుజూరాబాద్ ఉప ఎన్నికను తేలికగానే తీసుకునేటట్లయితే దళితబంధు లాంటి పథకాలను ఆగమేఘాల మీద ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మండలానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యేలను దాదాపు రెండు నెలలుగా హుజూరాబాద్‌లోనే ఎందుకు మోహరించాల్సి వచ్చిందన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్రస్థాయి నేతలతో సమావేశం నిర్వహించారు. దళితబంధును ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తమకు చాలా చిన్న అంశమని, అన్ని ఎన్నికల లాగానే ఇది కూడా ఒక మామూలు ఎన్నికేనని, అన్నింటా టీఆర్ఎస్ గెలిచినట్లే ఇక్కడా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇంకా దీనిపై సీరియస్ ఫోకస్ పెట్టలేదని, షెడ్యూలు వచ్చిన తర్వాత ఆలోచిస్తామన్నారు. హుజూరాబాద్‌లో గెలిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది లేదు, ఓడిపోతే రాష్ట్రంలో అధికారం నుంచి పడిపోయేది లేదు.. అయినప్పుడు ఎందుకు పెద్దగా లెక్కలోకి తీసుకుంటాం.. అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు.

హుజూరాబాద్ చుట్టూ నిర్ణయాలు

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు అలా ఉంటే పార్టీ అధినేతగా కేసీఆర్‌ చర్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. హుజూరాబాద్‌ మీదనే నెల రోజులుగా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దళితబంధు పథకంపై చర్చించడానికి ప్రగతి భవన్‌లో వరుస సమావేశాలు నిర్వహించారు. హుజూరాబాద్‌లోని మొత్తం 23 వేల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళితబంధును తీసుకొచ్చినట్లు తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించారు. టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ అని, సన్నాసుల మఠం కాదని, హిమాలయాల నుంచి వచ్చినవారం కామని, ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ను ఎంచుకున్నదే అందుకోసమంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డిని, కౌశిక్‌‌రెడ్డిని, ఎల్.రమణను బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఆహ్వానించి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. ఇదే జిల్లాకు చెందిన బండ శ్రీనివాస్‌కు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అనుకూలంగా ఉన్న అధికారులను ఆ జిల్లాలో నియమించారు. ఆసరా పింఛన్ల వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించడం, కొత్తగా రేషను కార్డులను మంజూరు చేయడం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులను కేటాయించడం, గ్రామాల్లో సిమెంటు రోడ్లు మొదలు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం, దళితబంధును లాంఛనంగా హుజూరాబాద్‌ నుంచి ప్రారంభించడం.. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా ఈ నెల రోజుల వ్యవధిలోనే ఊహించనంత వేగంగా జరిగిపోయాయి.

మరోవైపున మంత్రులను, ఎమ్మెల్యేలను హుజూరాబాద్ నియోజకవర్గంలోనే మోహరించి దాదాపు రెండు నెలలుగా ప్రచారంలో తిప్పుతున్నారు. పార్టీ, ప్రభుత్వ ఆచరణ ఇలా ఉంటే కేటీఆర్ వ్యాఖ్యలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. మొదటి నుంచీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటివని, ఇంతకాలం గెలుపు వచ్చినట్లుగానే ఇకపైన కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఇది మేకపోతు గాంభీర్యమే..

కేటీఆర్ చెప్పిందే నిజమైతే ఇప్పుడు ప్రకటిస్తున్న పథకాలు, కళ్లముందు జరుగుతున్న చేరికలు దేనికోసం?. దళితబంధు తెచ్చింది హుజూరాబాద్‌ను దృష్టిలో పెట్టుకుని కాదా? మహిళా సంఘాలకు వడ్డీ పైసలు ఇప్పుడే ఎందుకు చెల్లిస్తున్నట్లు? ఇన్నేళ్ల పరిపాలనో కనిపించని సంక్షేమాన్ని ఇప్పుడే భుజానికి ఎందుకు ఎత్తుకున్నట్లు? ఇతర పార్టీలవారిని ప్రలోభాలకు గురిచేసి ఎందుకు చేర్చుకుంటున్నట్లు? వారికి పదవులను ఎందుకు ఇస్తున్నట్లు? ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని పార్టీ అధినేతకు అర్థమైంది. గెలవడం కష్టమేనని తేలిపోయింది. అందుకే పథకాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పార్టీ ప్రయోజనాల కోసం కేసీఆర్ కుమ్మరిస్తున్నారు. అభద్రత నుంచే ఇవన్నీ ప్రకటిస్తున్నారు. కేటీఆర్ మాటలన్నీ మేకపోతు గాంభీర్యమే.
-దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్

టీఆర్ఎస్‌కు భయం పట్టుకున్నది

అటు ముఖ్యమంత్రిని గానీ, ఇటు టీఆర్ఎస్ పార్టీని గానీ ప్రజలు నమ్మడం లేదనేది స్పష్టమవుతున్నది. ఓటమి తప్పదనే భయం పట్టుకున్నది. అందుకే వేల కోట్ల రూపాయలను ఆ పార్టీ ఖర్చు పెడుతున్నది. ఆ భయంలో భాగమే ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం, వారికి పదవులను ఇవ్వడం, మరికొద్ది మందికి ఆశచూపడం. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను ఈ నియోజకవర్గానికి లేదా జిల్లాకు చెందినవారికే ఇస్తున్నారు కేసీఆర్. ఇక మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ మొదలు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ నియోజకవర్గానికే పరిమితం చేశారు. దళితబంధు పేరుతో వేల కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఇక్కడ గెలుపు కోసమే. కానీ ఆ పార్టీ ఓటమి తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే గెలిచినా.. ఓడినా.. అనే కామెంట్ చేశారు కేటీఆర్.
-జితేందర్ రెడ్డి, బీజేపీ నాయకుడు

Advertisement

Next Story

Most Viewed