కరోనా నియంత్రణ బాధ్యత ప్రతిపక్షాలకు లేదా..!

by Shyam |
కరోనా నియంత్రణ బాధ్యత ప్రతిపక్షాలకు లేదా..!
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. భారతదేశమూ భయపడుతోంది. కరోనా వైరస్ (కోవిడ్-19) కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నది. ఇంకా తీసుకుంటోంది. ఈ నెల 22న జనతా కర్ఫ్యూ విధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. అయితే, ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం విదితమే. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు చికిత్స కంటే నివారణే మేలన్న చందంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, సినీ తారలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నివారణా చర్యలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఆ పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ తమ, తమ కార్యక్షేత్రాల్లో ఉండి ఈ వైరస్ గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. అయితే, ఈ కార్యక్రమాల్లో కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులే కాకుండా ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొనవచ్చుననీ, కాని ఇతర పార్టీల నాయకులు పెద్దగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్టు కనబడటం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలూ సహకరించాలని వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాన ప్రతిపక్షం పేరుకేనా..?

తామే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వారు కరోనా నివారణా చర్యల్లో ఎందుకు పాల్గొనడం లేదనీ పలువరు ప్రశ్నిస్తుండగా.. ప్రతిపక్షాల పని కేవలం ప్రభుత్వం దుమ్మెత్తి పోయడమే కాదనీ, కరోనా నివారణకు వారూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు, సినీ హీరోలు కరోనా కట్టడికి ప్రభుత్వానికి ఇప్పటికే విరాళాలందజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ సమావేశాల్లో కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రత్యక చర్యలు తీసుకోవాలని గళమెత్తారనీ, కాని ఇప్పుడు నివారణా కార్యక్రమాల్లో ఎక్కడా కనబడటం లేదని, తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ ప్రజాప్రతినిధులపై లేదా అని పలువురు అడుగుతున్నారు.

టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పత్రికా ప్రకటనలు తప్ప నియోజకవర్గంలో పర్యటించి అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం లేదు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కాని నియోజకవర్గంలో కోవిడ్ కట్టడికి కృషి చేస్తున్నట్టు కనబడటం లేదు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం తన రెండు నెలల వేతనం ప్రభుత్వ సహాయ నిధికి ఇస్తున్నట్టు ప్రకటించగా, బీజేపీ ఎంపీ, తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కరోనా కట్టడికి రూ.50లక్షల చెక్కును ఆ జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.

ప్రజల బాధ్యత ప్రతినిధులదే..

కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు తమ సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. కరోనా కట్టడికి ప్రజలు సంసిద్ధమయ్యే విధంగా స్వీయ నియంత్రణ, పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు.

Tags : coronavirus (covid-19), telangana state , prevention, mla, mp, mlc

Advertisement

Next Story