బిగ్‌న్యూస్.. ఆ కమిషనర్‌ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ నేతలు

by Anukaran |   ( Updated:2021-09-10 09:50:18.0  )
బిగ్‌న్యూస్.. ఆ కమిషనర్‌ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ నేతలు
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ నాగప్రసాద్ వర్సెస్ అధికార పార్టీ నేతల వ్యవహారం సంచలనం రేపుతోంది. పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే.. కొందరు రూలింగ్ పార్టీ లీడర్స్ ఆయనపై పగబట్టి బదిలీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఎన్నడు చూడని విధంగా మణుగూరులో కమిషనర్ కృషితో నూతన టెక్నాలజీ, కొత్త కొత్త వాహనాలను తీసుకువచ్చారని మేథావులు చెబుతున్నారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి.. కూల్చివేయించిన ఘనత కూడా నాగ ప్రసాద్‌‌కే దక్కుతోందంటున్నారు. ఈ అక్రమ కట్టడాల్లో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఎమ్మెల్యే రేగా, కమిషనర్ మధ్య మాటల యుద్ధం జరిగినట్టు మాట్లాడుకుంటున్నారు స్థానికులు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు మండలంలో చేస్తున్న కబ్జాలు, భూదందాలకు కమిషనర్ అడ్డుగా ఉన్నాడని.. అందుకే స్థానిక ఎమ్మెల్యే రేగాతో చెప్పి ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

పాత కమిషనర్‌ను రప్పించడానికేనా..

గతంలో మణుగూరుకు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన వెంకటస్వామిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఇతడు స్థానిక టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై భూ కబ్జాలు, భూదందాలకు పాల్పడేవారని ఆరోపణలు ఉన్నాయి. ఒకానొక సమయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి కండువా కప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే రేగా క్యాంపు కార్యాలయం చుట్టు బదిలీ కోసం ప్రదక్షిణలు చేస్తున్నట్టు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం వెంకటస్వామి వైరా మున్సిపల్ కమిషనర్‌గా కొనసాగుతున్నాడు. మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్‌గా వెంకటస్వామి మళ్ళీ వస్తే కొందరి భూకబ్జాలు, భూదందాలకు అడ్డూ అదుపు ఉండదని ప్రజలు, మేథావులు మాట్లాడుకుంటున్నారు. అందుకే వెంకటస్వామి కోసమే ఆ నాయకులు కూడా ఎదురుచూస్తున్నారని టాక్.

జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నట్టు..

మణుగూరు మున్సిపాలిటీలో ఇంత జరుగుతున్నప్పటికీ.. జిల్లా కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కమిషనర్ నాగప్రసాద్‌ని బదిలీ చేయరనే వాస్తవాలు సైతం బయటకు వస్తున్నాయి. మరి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే రేగా మాట విని నాగప్రసాద్‌ని బదిలీ చేస్తారా.. చేయరా అనేది మండలంలో సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed