ప్రలోభాల్లోనూ సెంటిమెంట్.. స్పెషల్ బ్యాగుల్లో తాయిలాలు!

by  |   ( Updated:2021-12-09 12:06:58.0  )
Pralobham
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికారపార్టీకి చెందిన ఓటర్లు చేజారిపోకుండా పార్టీ అధిష్టానం అనేక చర్యలు చేపట్టింది. గోవా, బెంగుళూరు నగరాల్లో క్యాంపుల కథ సమాప్తమైంది. మందు, విందు, నగదు లాంటివి సక్సెస్‌పుల్‌గా జరిగిపోయింది. ఆ తర్వాత సెంటిమెంట్‌గా తిరుపతి లాంటి ప్రాంతాలకు దైవదర్శనం ప్యాకేజీని అమలుచేసింది. తాజాగా నగర శివారు ప్రాంతాల్లోని రిసార్టుల్లో విలాసంగా ఉంటున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కౌన్సిలింగ్ కూడా పూర్తయింది. ఓటర్లుగా ఉన్న వీరికి ఒక ప్యాంట్ బిట్, షర్ట్ బిట్, పట్టుచీర, మరికొన్ని దుస్తులు ప్రత్యేకంగా బ్యాగులో పెట్టి ఇస్తున్నారు. దీనితో పాటే పసుపు, కుంకుమను కూడా అందిస్తూ ఎమోషనల్ టచ్ జోడించారు. క్రాస్ ఓటింగ్ అయితే చర్యలు కఠినంగానే ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకున్నది. పోలింగ్ జరిగే 5 జిల్లాలకు చెందిన ఓటర్లంతా రిసార్టుల నుంచి నేరుగా పోలింగ్ బూత్‌లకు శుక్రవారం ఉదయం చేరుకోనున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతీ ఓటు కీలకమని వీరికి అధికార పార్టీ నేతలు కౌన్సిలింగ్ ఇచ్చారు. గెలుపు తధ్యమంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నా క్రాస్ ఓటింగ్ భయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు జిల్లాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు కోఆప్షన్ సభ్యులకు పది రోజులకు పైగా క్యాంపుల్లో విలాసాల్లో ముంచెత్తారు.

ఆయా జిల్లాలకు చెందిన ఓటర్లను ఇన్‌చార్జి మంత్రులే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కొద్దిమంది మంత్రులు ఓటర్లతో పాటే క్యాంపుల్లో ఉన్నారు. ఆ తర్వాత తీర్థయాత్రలకూ వెళ్ళారు. అభివృద్ధి నిధులతో పాటు పార్టీలు పదవులు ఇస్తామంటూ వారికి హామీ ఇచ్చారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యత ఉండదని హెచ్చరించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవడం ఇప్పుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు, ఎంపీలకు సవాలుగా మారింది.

నేడు నేరుగా పోలింగ్ కేంద్రాలకు…

స్థానిక సంస్థల ఓటర్లంతా శుక్రవారం ఉదయం 10 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళికలు రెడీ అయ్యాయి. ఉదయం 7 గంటలకల్లా టిఫిన్ల కార్యక్రమాన్ని ముగించుకుని రెడీగా ఉండాల్సిందిగా మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు లేదా స్వతంత్ర అభ్యర్థులతో టచ్‌లో లేకుండా వారి మొబైల్ ఫోన్లను తీసేసుకున్నారు. మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాతనే వారు మొబైల్ ఫోన్లు అందుకుని ఇళ్ళ బాట పట్టనున్నారు. దాదాపు రెండు వారాలుగా ఇంటికి దూరమైన వీరి చెర శుక్రవారం మధ్యాహ్నంతో తీరిపోనున్నది. ఇన్ని రోజులుగా ఎంత కసరత్తు చేసినా ఇప్పటికీ క్రాస్ ఓటింగ్ భయం టీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నది.

Advertisement

Next Story

Most Viewed