- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ కబ్జాలపై గులాబీ దళంలో దుమారం
టీఆర్ఎస్ కు 2020 కలిసి రావడం లేదు. పరాజయమెరుగని పార్టీ వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దానికి తోడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపైనా అక్రమాలు, కబ్జాలు అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అధికార పక్షం అంటే జనానికి భయం ఉండేది. ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులపైన మాట్లాడేందుకు సాహసం చేసేవారు కాదు. ఇప్పుడు ఏకంగా కేసులు పెట్టేందుకూ వెనుకడుగు వేయడం లేదు. సొంత కార్యకర్తలే ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. నిజాలను నిగ్గు తేల్చాలంటున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కబ్జాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువులు, ఎఫ్టీఎల్ భూములు, నాలాలను యథేచ్ఛగా ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నంటి మీద న్యాయ విచారణ జరపాలని విపక్షాలు బందులకు పిలుపునిస్తున్నాయి. అధికారాన్ని ఉపయోగించుకొని నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వివాదాస్పద భూములను తక్కువ ధరలకే కొనుగోలు చేసి, ఆ తర్వాత సెటిల్మెంటు చేసుకుంటున్నారని, ఏనాడో లే అవుట్లుగా మారిన భూములను, మళ్లీ సాగు భూములుగా కొనుగోలు చేస్తున్నారని మండిపడున్నారు. దుబ్బాకలో అధికార పార్టీ సిట్టింగు స్థానాన్ని కోల్పోయింది. సెంచరీ కొడతామన్న జీహెచ్ఎంసీలో 56 పరుగుల దగ్గరే ఆగిపోయింది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇటు భూ కబ్జాలపై పెద్ద ఎత్తున నిరసనలు, ఆరోపణలు, కేసులు బయటకు రావడంతో పార్టీలో దుమారం రేగుతోంది. అధిష్టానం మద్ధతు పలకడంతోనే వారు అక్రమాలకు పాల్పడుతున్నారని సొంత కార్యకర్తలు, అభిమానులే చర్చించుకుంటున్నారు. కేసీఆర్ విశ్వాసంతో టికెట్లు ఇచ్చి గెలిపించి.. మంత్రి పదవులు కట్టబెడితే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అంటున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించి నిజానిజాలను ప్రజలకు వెల్లడించకపోతే పార్టీ మరింత చులకన అవుతుందంటున్నారు.
జాగాల మీదనే నజర్
కొందరు మంత్రులు, ఎమ్మెల్సీలు, చాలా మంది ఎమ్మెల్యేలు భూములపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఎకరా భూమి రూ.10 లక్షల పైమాటేనని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించారు. అందుకే అక్కడ సంపాదనకు తెర తీశారు. గతంలో నేతలు బినామీ కంపెనీల పేరిట టెండర్లు వేసి పనులు దక్కించుకునేవారు. ఇప్పుడు పనులన్నీ ఒకటీ రెండు పెద్ద కంపెనీలకే దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది రియల్టర్లుగా, బిల్డర్లుగా మారిపోయారు. వివాదాస్పద భూములను కొనుగోలు చేయడం, వాటిని సెటిల్ చేసుకోవడం.. తిరిగి అమ్మి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ స్థాయిలో మంజూరైన పనులను వారికి అప్పగిస్తే ఈ దందాకు పాల్పడేవారు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రి నుంచి సర్పంచ్ వరకు చాలా మంది ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం.
వరుస ఘటనలు
కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో 2.13 ఎకరాలను మంత్రి మల్లారెడ్డి, ఆయన కొడుకు భద్రారెడ్డి కబ్జా చేస్తున్నారని శ్యామలాదేవి అనే మహిళ చేసిన ఫిర్యాదు మీద కేసు నమోదైంది. మేడ్చల్ నియోజకవర్గంలోనూ ఆయన అనుచరులు కొందరు భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల పెద్ద చెరువు మత్తడి స్థలాన్ని కబ్జా చేశారని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేర్యాల బంద్ జరిగింది. ఈ చెరువు దాదాపు 215 భూమిలో విస్తరించి ఉంది. ఎమ్మెల్యే తన కూతురు తుల్జా భావానీరెడ్డి పేరిట 21 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లా పాల్వంచ మండలం బంగారు జాలలో ఓ ఎమ్మెల్యే అండదండలతో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యానగర్ నుంచి రామవరం వెళ్లే బైపాస్ లో 15 ఎకరాలను కబ్జా చేశారు. దీని వెనుక ఓ జెడ్పీ చైర్ పర్సన్ కు సంబంధించినవారే ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు ఏకంగా అటవీ భూమి ఎనిమిది ఎకరాలను కబ్జా చేసినట్లు ఖమ్మంలో చర్చ జరుగుతోంది.
ఈడనకా..ఆడనకా
కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ శివారులో రెండెకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఓ ఎమ్మెల్యే కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కబ్జాకు పాల్పడ్డారంటూ ఓ పత్రికలో వార్త ప్రచురితమైంది. విలేకరిని చంపేస్తా.. దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించిన ఘటనపై జర్నలిస్టు సంఘాలు పోరాడుతున్నాయి. యాదగిరిగుట్ట మండలం మాసాయి పేటలో అసైన్డ్ భూమిని దళితులకు కేటాయించారు. కొందరు నాయకులు వాటిని బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని లాంఛనంగా రెండోసారి స్పెక్ట్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు కట్టబెట్టారు. ఓ ఎమ్మెల్యే వర్గీయులే ఇందులో ప్రధాన భూమిక పోషించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలా నాలాలు కబ్జాకు గురయ్యాయి. నాలాలను మూసేసి విల్లాలను నిర్మించారు. పాత రెవెన్యూ మ్యాపుతో పరిశీలిస్తే ఏ స్థాయిలో నాలాలను ఆక్రమించారో వెల్లడవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు ఓ ఎమ్మెల్సీ సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కోకాపేటలోనూ
రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భూములు ఉన్న ప్రాంతం కోకాపేట.. ఆ ఏరియాలో ఓ చెరువు ఎఫ్టీఎల్ ను ఆక్రమించి విల్లాలు నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ ఎమ్మెల్సీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ తమకు తక్కువ ధరకే అమ్మాలంటూ బెదిరించారని సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మునుగోడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో రాచకొండ భూములు ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితమే వెంచర్లు వేశారు. ప్లాట్లు చేయకుండా వెబ్ సైట్ ద్వారానే క్రయ విక్రయాలు జరిగాయి. వందలాది ఎకరాలను నాలా కన్వర్షన్ చేశారు. వందలాది ఎకరాలు సాగు భూములుగానే మిగిలాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు ప్రజాప్రతినిధులు ప్లాట్లుగా విక్రయించిన భూములను సాగు భూములుగా కొనుగోలు చేశారు. తక్కువ ధరకే కొనుగోలు చేసి.. ఆ తర్వాత వాస్తవ మార్కెట్ ధరలకు విక్రయించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేస్తే ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.