వాళ్లు తప్పు చేస్తే మేం నష్టపోవాలా.. ఆదివాసీలు ఆగ్రహం

by Sridhar Babu |   ( Updated:2021-07-13 05:54:43.0  )
Tribal protest
X

దిశ, భద్రాచలం: రెవెన్యూ అధికారుల తప్పిదాన్ని సరిచేసి తమ భూమికి పట్టాలు ఇవ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ ఆఫీసు ఎదుట చర్ల మండలంలోని విజయకాలనీకి చెందిన ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చర్ల రెవెన్యూ అధికారులు చేసిన తప్పుకు నిరుపేదలమైన మేము నష్టపోవాలా? అని ప్రశ్నించారు. అప్పటి అధికారులు చేసిన తప్పుని.. ప్రస్తుత అధికారులు సరిచేసి గత 15 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని తిరిగి రికార్డెడ్‌(పట్టా)గా తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్ల నుంచి ఈ భూమినే నమ్ముకొని బతుకుతున్నామని, ఈ భూమి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. గత పదిరోజులుగా చర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొలగాని బ్రహ్మాచారి డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుంజా శ్రీను, సీపీఎం నాయకురాలు పి.సమ్మక్క, విజయకాలనీ గిరిజనులు వరలక్ష్మి, మురళి రాములమ్మ, గీత, సూరమ్మ, జయలక్ష్మి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed