One month old baby girl : చెత్తకుప్పలో పసిపాప.. ఏడుపు విని రక్షించిన మెకానిక్‌.. ఫోటోలు వైరల్

by Ramesh N |
One month old baby girl : చెత్తకుప్పలో పసిపాప.. ఏడుపు విని రక్షించిన మెకానిక్‌.. ఫోటోలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమకు పిల్లలు కలగాలని ఎంతో మంది తల్లిదండ్రులు డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. సంతానం కలగడం కోసం పూజలు చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం పుట్టిన బిడ్డలను చెత్తకుప్పలో పడేసి వెళ్లిపోయిన తల్లిదండ్రుల అమానవీయ ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా చైన్నైలో ఇలాంటి అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి సైదాపేటలోని సీఐటీ నగర్‌లోని నాల్గవ ప్రధాన రహదారిపై చెత్త కుండీ నుంచి నెల రోజుల పసికందును స్థానికులు రక్షించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన మెకానిక్‌గా పనిచేస్తున్న కలియపెరుమాళ్ (40) అనే వ్యక్తికి పసి పాప ఏడుపు వినిపించింది. ఈ నేపథ్యంలోనే అతను రోడ్డు పక్కన ఉన్న మూడు చెత్త డబ్బాలో వెతికితే ఒకదానిలో పసిపాప కనిపించింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సైదాపేట ఎల్‌అండ్‌ఓ బృందం ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని రక్షించి మహిళా పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. అనంతరం సైదాపేట పోలీసులు పాపను టీ నగర్‌లోని బాల మందిర్ కామరాజ్ ట్రస్ట్ అనాథాశ్రమానికి అప్పగించారు. ప్రస్తుతం చిన్నారి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై సైదాపేట పోలీసులు కేసు నమోదు చేసి ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాసిపాపకు సంబంధించిన తాజాగా వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చిన్నారి తల్లిదండ్రులకు ఆ పసిపాపను ఇవ్వకూడదని కొంత మంది నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు. పెళ్లి అయ్యి తొమ్మిది ఏళ్లు గడిచినా ఇంకా పిల్లలు కలగలేదని, ఆ చిన్నారిని ఇస్తే తాము దత్తత తీసుకోని పాపను మంచిగా చూసుకుంటామని ఓ నెటిజన్ కామెంట్ అందరి హృదయాలను కలిచి వేసింది.

Advertisement

Next Story

Most Viewed