'జై శ్రీరామ్' అనాల్సిందే! లేదంటే పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు! నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-05-07 14:09:38.0  )
జై శ్రీరామ్ అనాల్సిందే! లేదంటే పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు!  నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'జై శ్రీరామ్' అనడానికి ఇష్టపడని వారు పాకిస్తాన్‌కు వెళ్లవచ్చు.. అంటూ బీజేపీ నేత, ప్రముఖ నటి నవనీత్ కౌర్ వివాదానికి తెరలేపారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర ఎంపీగా ఉన్న నవనీత్ కౌర్ ఆదివారం గుజరాత్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కచ్ లోక్‌సభ అభ్యర్థి వినోద్ భాయ్ చావ్డాకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న అమరావతి ఎంపీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘జై శ్రీరాం అనడానికి ఇష్టపడని వారు పాకిస్థాన్‌కు వెళ్లవచ్చు. ఇది హిందుస్థాన్. మీరు హిందుస్థాన్‌లో ఉండాలనుకుంటే, మీరు జై శ్రీరామ్ అని చెప్పాలి’అని నవనీత్ కౌర్ అన్నారు.

దీనికి సంబంధించిన వీడియోలు తాజగా సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాగా, 2014లో, నవనీత్ కౌర్ రాణా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసినప్పటికీ, ఆమె ఎన్నికల్లో ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నవనీత్ కౌర్ ఈసారి మహారాష్ట్రలో బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే సమక్షంలో ఆమె కాషాయ పార్టీలో చేరారు.

Advertisement

Next Story

Most Viewed