టెస్ట్‌లతో సంబంధం లేకుండా చికిత్సలు

by Shyam |
టెస్ట్‌లతో సంబంధం లేకుండా చికిత్సలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టెస్ట్‌తో సంబంధం లేకుండా లక్షణాలున్నవారందరికీ కొవిడ్ చికిత్సలు అందిస్తున్నామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నిర్వహించని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 24,887 ఆరోగ్య బృందాలు ఏర్పాటు చేసి 70లక్షల మందికి ఫీవర్ సర్వే చేసిందని, వీరిలో కొవిడ్ లక్షణాలున్న 2.30 లక్షల మందికి కొవిడ్ కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సూచనల ప్రకారం కోవీషీల్డ్ సెకండ్ డోసు వ్యాక్సిన్‌ను 12 నుంచి 16 వారాల లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చని ప్రకటించారు.

లాక్‌డౌన్ ప్రభావంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా తగ్గిందని చెప్పారు. లాక్‌డౌన్ నిబంధలను పాటించడంలో కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారి వలన వైరస్ వ్యాప్తి జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లిళ్లకు ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం సూచించినంత మంది మాత్రమే పాల్గొనాలని తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తే సెకండ్ వేవ్ వైరస్‌ నుంచి త్వరలోనే బయటపడతామన్నారు.

సెకండ్ డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులో బెడ్లు ఖాళీగా ఉన్నాయని, ఈ వివరాలను ఆన్‌లైన్‌లో సేకరించి ఆసుప్రతుల్లో చికిత్సలు పొందాలని తెలిపారు. కొవిడ్ మందులను, రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లను, ఆక్సిజన్‌ను జాతి సంపదగా భావించి జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లకు ప్రత్యామ్నాయంగా ఇంటర్ ఫెరా, అజిత్రో మైసిన్, ఎపిక్స్ ప్యాన్, లోవర్ ఎక్స్ ప్యాన్ వంటి ఇతర ఇంజక్షను వినియోగించాలని డాక్టర్లకు సూచించారు.

బ్లాకా ఫంగస్ కొత్త వ్యాధికాదు: డీఎంఈ రమేష్ రెడ్డి

బ్లాక్ ఫంగస్ పై వస్తున్న వదుంతులను నమ్మకూడదని, ఇది కొత్త వ్యాధి కాదని డీఎంఈ రమేష్ రెడ్డి అన్నారు. గాంధీ ఆసుపత్రిలో కేవలం ముగ్గురు రోగులు మాత్రమే బ్లాక్‌ఫంగస్‌కు చికిత్సలు పొందుతున్నారని స్పష్టం చేశారు. కొవిడ్ పేషెంట్లకు హైడోసు మందులను, ఇంజక్షన్లను ఇవ్వడం ద్వారా కొందరికి మాత్రమే బ్లాక్‌ఫంగస్ వ్యాధి సోకుతుందని తెలిపారు. సైటోకైన్ సర్జ్‌ అనే ఇంజక్షన్‌ను ఎక్కవగా పేషెంట్‌ కు ఇవ్వడం వలన శరీరంలో షుగర్ లెవల్ తగ్గుపోయి, ఇమ్యూనిటీ దెబ్బతిని బ్లాక్ ఫంగస్ వస్తుందని వివరించారు. అన్ని ప్రైవేటు చిన్న ఆసుపత్రుల్లో కూడా అవసరాలను బట్టి రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లను అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని తెలిపారు.

వెంటిలెటర్ల అవసరాన్ని బట్టి కొత్తగా 1300 వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తున్నామని, టెక్నిల్ ఇబ్బందుల వలన కొంత ఆలస్యమవుతుందని చెప్పారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బయోమెడికల్ టీంను ఏర్పాటు చేసి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతామన్నారు. ఆక్సిజన్‌ కొరతతో కింగ్‌కోఠి ఆసుపత్రిలో ఏ ఒక్క పేషెంట్ చనిపోలేదని స్పష్టం చేశారు. కరోనా పేషెంట్లకు చికిత్సలు అందించేందుకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది మందుకు రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story