రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం.. 400 మంది సిబ్బందికి ట్రాన్స్‌ఫర్స్.?

by Anukaran |
రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం.. 400 మంది సిబ్బందికి ట్రాన్స్‌ఫర్స్.?
X

దిశ, ప్రత్యేక ప్రతినిధి : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో మూకుమ్మడి బదిలీలకు రంగం సిద్ధమైంది. దాదాపు 70 మంది సబ్ రిజిస్టార్లను బదిలీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతోపాటు కొన్ని ఏళ్ల పాటు ఒకే కార్యాలయంలో తిష్ట వేసిన దాదాపు 400 మంది సిబ్బందిని బదిలీ చేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వరుస పరంపరగా జరిగిన ఏసీబీ దాడులలో కొంతమంది సబ్ రిజిస్టర్లు పట్టుబడటంతో రిజిస్ట్రేషన్ శాఖలో కలవరం మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేయడం వంటి అవినీతి బాగోతాలు వెలుగు చూశాయి.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో పాటు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ శేషాద్రి బదిలీలపై దృష్టిసారించారు. ప్రధానంగా జోన్-5 పరిధిలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలపై దృష్టి సారించారు. ఈ జిల్లాలలో 2013, జూన్ నుంచి సబ్ రిజిస్టార్లు కానీ, కిందిస్థాయి సిబ్బంది కానీ అసలు బదిలీ కాలేదు. ఒకే చోట అధికారులు, సిబ్బంది పాతుకుపోవడం వల్ల అవినీతి, అక్రమాలకు ఎక్కువ ఆస్కారం ఏర్పడింది. వరంగల్ జిల్లాలో ఇటీవల కొందరు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు.

హైదరాబాద్ శివార్లలో పాటు ఆరో జోన్ పరిధిలోని మహబూబునగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలలో సుదీర్ఘ కాలం ఒకే చోట పని చేస్తున్న అధికారుల జాబితా సిద్ధమైంది. ఒకే చోట పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది వందలలో ఉన్నారు. వీరి జాబితా కూడా సిద్ధమైంది. కనీసం మూడేళ్లు పైబడి ఒకే చోట పని చేస్తున్న వారిని బదిలీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఆయా జిల్లాలలో అవినీతి అక్రమాల ఆరోపణలపై ఉన్నతాధికారులు డీఐజీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed