త్వరలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ

by Shyam |   ( Updated:2021-06-10 11:39:03.0  )
Transfer of IAS and IPS
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. రెండో టర్ములో ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని భావించినా పరిపాలనాపరమైన కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. దాదాపు అన్ని రకాల ఎన్నికలు పూర్తికావడంతో అడ్మినిస్ట్రేషన్‌పై పూర్తి దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ పాలనలో వేగం తీసుకురావాలని భావించారు. ఇందుకోసం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులను మార్చకపోవచ్చుగానీ హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలను మాత్రం భారీ స్థాయిలోనే బదిలీ చేయవచ్చని అధికార వర్గాల సమాచారం.

ఈ బదిలీ ప్రక్రియ మే నెల 30వ తేదీన జరగాల్సి ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో వాయిదా పడిందని, ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం. సుమారు పాతిక మందికి పైగా ఐఏఎస్ అధికారులు, అంతే సంఖ్యలో ఐపీఎస్ అధికారులు మారవచ్చని తెలిసింది. మూడేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఒకే పోస్టులో ఉన్న అధికారులకు ఈసారి బదిలీ వేటు తప్పదని ఆ వర్గాలు నొక్కిచెప్పాయి.

ఇప్పటికే వివిధ పథకాల అమలు, గ్రామీణ స్థాయిలో పాలనా వ్యవస్థ తదితరాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఆయన ఆలోచనలకు అనుగుణంగా వేగంగా, సమర్ధవంతంగా నిర్వహించే అధికారులను ఎంపిక చేసి ముఖ్యమైన బాధ్యతల్లో పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed