అందులో భాగంగానే.. అంబానీకి నాలుగో స్థానం

by Shyam |
అందులో భాగంగానే.. అంబానీకి నాలుగో స్థానం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జాతి సంపదను ప్రయివేటు వ్యక్తులకు, విదేశీ సంస్థలకు మోడీ సర్కార్ దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్లంబర్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు అమ్జద్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న హాజరై మాట్లాడారు.

గత కొన్నేండ్లుగా దేశ ప్రజలు సృష్టించిన సంపదను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యత సందర్భంగా సేవ్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రక్షణ రంగం బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసీ, బ్యాంకింగ్, బొగ్గు గనులు, విమానయానం అన్నిటినీ మోడీ ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించారని అన్నారు.

లాక్‌డౌన్ సందర్భంగా మోడీ రూ.20 లక్షల కోట్లు కేటాయించినా, పేదలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. మొత్తం డబ్బులను కార్పొరేట్ శక్తులకు పంచి పెట్టారని విమర్శించారు. దేశభక్తి ముసుగులో దేశ ద్రోహం చేయడం మోడీకి తగదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం మానుకోవాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.21వేలు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed