ఏప్రిల్‌లో తగ్గిన ట్రాక్టర్ అమ్మకాలు

by Harish |
ఏప్రిల్‌లో తగ్గిన ట్రాక్టర్ అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఆటో పరిశ్రమలో ట్రాక్టర్ అమ్మకాలు సానుకూల వృద్ధిని సాధించాయి. గత నెలలో 10 నెలల విరామం తర్వాత మొదటిసారి ట్రాక్టర్ అమ్మకాలు డీలాపడ్డాయి. అయితే, మార్కెట్ వర్గాలు మాత్రం ప్రస్తుతానికి కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ వల్ల కొంత తగ్గినప్పటికీ తిరిగి అమ్మకాలు పుంజుకుంటాయని అంటున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌ను నియంత్రించేందుకు దేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ పరిణామాలతో ఏప్రిల్ నెలలో రిటైల్ ట్రాక్టర్ అమ్మకాలు అంతకుముందు నెల కంటే 40-45 శాతం తగ్గాయి. హోల్‌సేల్ అమ్మకాల్లో 20-25 శాతం క్షీనించాయి. ఇదే సమయంలో 2019, ఏప్రిల్ నాటి కంటే గత నెలలో ట్రాక్టర్ హోల్‌సేల్ అమ్మకాలు 17 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇతర వాహనాల విభాగాల కంటే ట్రాక్టర్ డిమాండ్‌పై ప్రభావం తక్కువగా ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

‘కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఊహించిన స్థాయిలో తీవ్రతరం అవుతుందని అనుకోవట్లేదని, ఏప్రిల్‌లో తగ్గిన అమ్మకాలు తిరిగి తక్కువ సమయంలో పుంజుకుంటాయని అంచనా వేస్తున్నామని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హెతల్ గాంధీ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ విక్రయాల డిమాండ్ 3-8 శాతం వరకు ఉంటుందని క్రిసిల్ వెల్లడించింది. 2020-21లో ట్రక్టర్ అమ్మకాలు 26 శాతం పెరిగి 8,99,00 యూనిట్లకు చేరుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed