- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఫామ్ హౌస్‌లో వరి సాగు.. సాక్ష్యాలతో సీఎంకు షాకిచ్చిన రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : వరి వేస్తే ఉరే అంటూ రైతుల్ని హెచ్చరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో ఆ పంటనే సాగుచేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తన దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయంటూ ఫోటోలను, వీడియోను మీడియాకు విడుదల చేశారు. స్వయంగా సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరిస్తానని, చూడాలనుకునేవారు రావచ్చని అన్నారు.
జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులంతా కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని వరి పంటనే సాగుచేయాలని, ప్రభుత్వం కొనకుంటే టీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టాలని అన్నారు. రైతులకు ఒకటి చెప్పి కేసీఆర్ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వరి వేయవద్దంటూ రైతులకు పిలుపునిచ్చిన కేసీఆర్ తన 150 ఎకరాల్లో మాత్రం ఎందుకు ఆ పంటనే వేశారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ భూమి మాత్రం పచ్చగా ఉండాలి.. రైతులు మాత్రం ఉరి వేసుకోవాలా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ తన భూమిలో పండిన పంటను ఎక్కడ అమ్మారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. స్వయంగా తానే ఎర్రవల్లికి వెళ్లి కేసీఆర్ సాగుచేస్తున్న వరి పొలాలను చూపిస్తానని అన్నారు. తనకొక న్యాయం.. ప్రజలకు మరో న్యాయమా? అంటూ ఫైర్ అయ్యారు.
పక్కనే ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రం కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నదని, తెలంగాణలో మాత్రం ఎంఎస్పీకి కూడా గతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో వరి వేయని రైతులకు చిరు ధాన్యాలు వేసేందుకు అక్కడి ప్రభుతం ఒక్కో ఎకరాకు రూ. 9 వేల చొప్పున బోనస్ ఇస్తున్నదని, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ అక్కడకు వెళ్లి పరిశీలించాలని హితవు పలికారు. అక్కడి సీఎంతో తెలంగాణ మంత్రులు కలిసేలా ఏర్పాట్లు చేయడానికి తానే చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వమే పంట కొనుగోలు చేస్తుందని, కానీ, తెలంగాణలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొని కేంద్రానికి అమ్ముతుందని వివరించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
మోడీ, కేసీఆర్ వైఖరి వల్ల వరి వేసుకునే రైతులు ఉరేసుకుంటున్నారని ఆరోపించారు. ఇతర దేశాలలో మన బియ్యానికి మంచి డిమాండ్ ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వమే పంట కొనుగోలుచేసి నేరుగా అమ్ముకోవచ్చని సూచించారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోసను పట్టించుకోకుండా రాజకీయ క్రీడలకు పాల్పడుతున్నాయన్నారు. మద్దతు ధర ప్రకటించిన పంటలు కొనకపోతే ప్రభుత్వంపై పీడీ యాక్ట్ పెట్టి జైలులో వేయాలన్నారు. రైతులు వరి పంటనే వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనదో చూస్తానని భరోసా కల్పించారు. క్వింటాల్ వడ్లకి బాయిల్డ్ రైస్, రా రైస్ మధ్య తేడా 15 కిలోలు మాత్రమేనని వివరించారు. మిల్లర్లు, దళారులతో కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైనట్లు ఆరోపించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మళ్ళీ వ్యవసాయ చట్టాలను తేనున్నట్లు చేసిన వ్యాఖ్యలను రేవంత్ ఖండించారు. రైతుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు మోడీ సర్కారు కొమ్ముకాస్తున్నదని ఆరోపించారు. రైతులు ఒక్కతాటిపై నిలబడి 14 నెలల పాటు ఆందోళన చేసినందువల్లనే కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసిన రేవంత్ మళ్ళీ ఇంకో రూపంలో ఆ చట్టాలను తెస్తే రైతుల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించిన తీరుపై రేవంత్ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. గతంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ధర్నా చేసిన టీఆర్ఎస్ శ్రేణులు ప్రధానితో భేటీ అయిన తర్వాత వణికిపోయి నాలుగు గోడలకే పరిమితమయ్యారని ఆరోపించారు. ఈసారి మళ్ళీ ఆ చట్టాలను తెస్తే కేంద్రంపై టీఆర్ఎస్ ఏ విధంగా కొట్లాడుతుందో జవాబు చెప్పాలని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటాలు తప్ప రైతుల గోస కేసీఆర్‌కి, కేటీఆర్‌కి పట్టడంలేదని ఆరోపించారు. మళ్లీ కొత్త చట్టాలను మోడీ ప్రభుత్వం తెస్తే కేసీఆర్, కేటీఆర్ ఎటువైపు ఉంటారో తేల్చాలని డిమాండ్ చేశారు. మోడీ పక్షం ఉంటారా లేక రైతుల పక్షం ఉంటారో చెప్పాలన్నారు.