‘క్విట్’ కేసీఆర్ అంటూ.. భారీ కాన్వాయ్‌తో ఇంద్రవెల్లికి బయలుదేరిన రేవంత్(వీడియో)

by Anukaran |   ( Updated:2021-08-09 01:46:44.0  )
Revanth-reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘క్విట్ ఇండియా డే’ సందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.

రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసినా యువకుల బలిదానాలకు సోనియా చలించిపోయి తెలంగాణ ఇచ్చారని, కానీ కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆశయాలు అమలు కావడం లేదన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ గద్దె దిగితేనే సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని, ఇక క్విట్ కేసీఆర్​ అంటూ రేవంత్ ​నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రపంచం ముందు భారత్ శక్తిమంతమైన దేశంగా నిలబడిందని, దేశానికి కాంగ్రెస్ స్వాతంత్య్రం తీసుకొచ్చి స్వేచ్ఛావాయువులను ఇచ్చిందని, కానీ ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.

కేసీఆర్, మోడీ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని, దేశంలో కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దళిత, గిరిజన వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి ఆ వర్గాలకు తీవ్ర నష్టం చేస్తున్నారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు.
గాంధీభవన్‌లో క్విట్ ఇండియా డే కార్యక్రమం అనంతరం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఇంద్రవెల్లి సభకు ర్యాలీగా తరలివెళ్లారు. ఇక్కడ నుంచి రేవంత్ ​వెంట భారీ కాన్వాయి వెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇందవెల్లిలో సభ ప్రారంభం కానుంది. రోడ్డు వెంట కూడా నినాదాలు చేసుకుంటూ కాంగ్రెస్​ శ్రేణులు జోష్​ చూపిస్తున్నాయి.

Advertisement

Next Story