111 జీవో రద్దుతో మహా నగరానికి ముప్పు..

by Kalyani |
111 జీవో రద్దుతో మహా నగరానికి ముప్పు..
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: 111 జీవో రద్దుతో హైదరాబాద్ మహానగరానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలకు తాగు నీరందించే గండిపేట, హిమయాత్ సగర్ జలాశయాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుపోనున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తంచేశారు. 111 జీవోపై తెలంగాణ కెబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లిలోని గురుస్వామి హాల్ లో తెలంగాణ సోషల్ మీడియా ఫోరం, తెలంగాణ సమాఖ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కరుణాకర్ దేశాయి అధ్యక్షతన ‘111 జీవో రద్దు పట్నానికి పాడె’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, హై కోర్టు సీనియర్ న్యాయవాది రచనా రెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ దొంతి నరసింహ్మ రెడ్డి, ప్రొఫెసర్ సుబ్బా రావు, అనురాధా రెడ్డి, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య, ఫాక్ట్ అధ్యక్షుడు బికే రెడ్డి, పిట్టల శ్రీశైలం, పిట్టల రవి, నైజాం సర్కారోడా నిర్మాత రాజమౌలి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, టి జాక్ నాయకులు షాబాజ్ అలి పలువురు పాల్గొని మాట్లాడారు.

ఎవరితో సంప్రదింపులు జరుపకుండా, శాస్త్రీయత కొరవడిన 111 జీవో రద్దు నిర్ణయం స్థానిక ప్రజల జీవనానికి, భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు అని వారు అభిప్రాయం వ్యక్తంచేశారు. జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111 రద్దు వల్ల అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం బలపరిచినట్లయిందని వారు విమర్శించారు. ఈ జీవో 111 పరిధిలో నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందన్నారు. ఏకపక్షంగా, రక్షణకు తావు లేకుండా తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. స్థానిక ప్రజలను భాగస్వాములను చేయకుండా, వారి ‘అభివృద్ధి’ పేరు మీద ఈ ప్రాంతాన్ని ధనికులకు, వలస వచ్చినవాళ్ళకు, తెలంగాణ వ్యతిరేకులకు పందేరం చేయడం తెలంగాణ ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. 84 గ్రామాలలో నివసిస్తున్న పేద, దళిత, బహుజన కుటుంబాలకు ఈ నిర్ణయం న్యాయం చేయకపోగా, వారి జీవనోపాధులకు విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు.

భూమిలేని ఈ కుటుంబాలను సామాజిక నిచ్చెనలో అట్టడుగు స్థాయిలోనే ఉండాలని ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు.111 జీవో పరిధిలోని 84 గ్రామాలలో నివసిస్తున్న పేద, దళిత, బహుజన కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. భూమిలేని ఈ కుటుంబాలను సామాజిక ధోరణితో అట్టడుగు స్థాయిలోనే ఉండాలని, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, జంట జలాశయాలను వారసత్వ సంపదగా గుర్తించాలని, వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో వాటిని పునరుద్దరించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని వక్తలు స్పష్టం చేశారు.

జంట జలాశయాల పరివాహక ప్రాంతంలో ప్రత్యేకంగా బహుజన బతుకమ్మ ఉత్సవాలకు నాంది పలుకుతూ, 84 గ్రామాలలో పేద, దళిత, బహుజన కుటుంబాలకు తగు ప్రభుత్వ పథకాలు వర్తింప జేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములలో ఈ గ్రామాల్లో భూమి లేని పేదలకు కనీసం ఎకరా భూమి ఇవ్వాలన్నారు. అసైన్డ్ భూములు లబ్దిదారులకు చేకుర్చాలి. మొత్తం పరివాహక ప్రాంతం పరిరక్షణకు విధాన కల్పనకు ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమతుల్య అభివృద్ధికి, సామాజిక న్యాయ సూత్రాలకు లోబడి స్థానికులతో కూడిన సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేయాలని డిమాండ్ చేశారు.

ఈ దిశగా పౌర సమాజం తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తుంది. భూమి, నీరు సహజ వనరులు ఇవి అందరికి, నిరంతరం అందేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. పరివాహక ప్రాంతంలో భూమి వినియోగ సర్వే చేయాలన్నారు. ఈ ప్రాంతంలో చేసిన 2016 సామాజిక సర్వే ఫలితాలు బయటపెట్టాలని డిమాండ్ వారు చేశారు. నిపుణుల కమిటీ వేసి ఈ సర్వేల ఫలితాల మేరకు ఒక సుస్థిర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. జంట జలాశయాలు, ఫిరంగ నాలా, బల్కాపూర్ నాలా తదితర నీటి వనరులను కాపాడేందుకు పూర్తి స్థాయి సంప్రదింపుల అనంతరం కార్యాచరణ ప్రకటించాలని, తగు నిధులు కేటాయించాలన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని, నిర్మించిన వారి మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సదస్సులో 9 తీర్మానాలు చేశారు.

Advertisement

Next Story