రిజర్వాయర్లు నింపండి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సమీక్షా సమావేశంలో సీఎం

by Kalyani |   ( Updated:2023-05-01 13:52:12.0  )
రిజర్వాయర్లు నింపండి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సమీక్షా సమావేశంలో సీఎం
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను వచ్చే వర్షాకాలంలో మొత్తం కెపాసిటీలో 30% నింపేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డి, ఉమ్మడి పాలమూరు, రంగా రెడ్డి సంబంధిత రాష్ట్ర అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు.

రికార్డు సమయంలో కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకోగలిగాం.. కేసులు, అనుమతుల ఆలస్యం ఇతర కారణాల వల్ల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేసుకోలేకపోయాం.. తాగునీటి అవసరాల కోసం అనుమతులు వచ్చిన నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వ్యక్తిగతాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణానది నుండి రావాల్సిన నీటి వాటా అంశం ఏదో ఒక రోజు తప్పనిసరిగా తేలుతుంది. ఆ లోపు పెండింగ్ పనులు అన్నింటిని పూర్తిచేయాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని సీఎం వెల్లడించారు.

రిజర్వాయర్లలో 30% నీటిని నింపండి..

ఇప్పటికే దాదాపు పూర్తి అయిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను వచ్చే వర్షాకాలంలో 30 శాతం నీటితో నింపాలని సీఎం ఆదేశించారు. అంతలోపు చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే పూర్తిచేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు అత్యంత ప్రాధేయతను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఉదండాపూర్, కరివేన రిజర్వాయర్ల నుండి కెనాల్స్ నిర్మాణం కోసం అవసరమైన పనులను తక్షణమే చేపట్టాలని సీఎం కోరారు. పనులను మూడు నుండి నాలుగు భాగాలు చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని సూచించారు. భూసేకరణ, తదితర పనులను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన నిధుల కేటాయింపులు, ఉత్తర్వులు వెంటనే విడుదలవుతాయని కేసీఆర్ వెల్లడించారు.

కోయిల్ సాగర్-కేఎల్ఐ కి మరిన్ని నిధులు..

ఉమ్మడి జిల్లాలోనీ కోయిల్ సాగర్, కేఎల్ఐ ప్రాజెక్టుల పెండింగ్ పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని జిల్లా మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి అయ్యేందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, నివేదికలను వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు పాలమూరు జిల్లా ఎంపీలు రాములు, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ఆలవెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, కృష్ణమోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read more:

ఇళ్ల స్ధలాల క్రమబద్దీకరణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Advertisement

Next Story