- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాప్ సీక్రెట్.. కేటీఆర్ కాన్వాయ్ రెడీ!
దిశ, తెలంగాణ బ్యూరో : కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న కేటీఆర్ కోసం కొత్త కాన్వాయ్ సిద్ధమవుతోంది. టొయోటా కంపెనీకి చెందిన లాండ్ క్రూయిజర్ ఆర్మర్డ్ (ప్రాడో) వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం పది వాహనాలను సమకూర్చుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారుల సమాచారం. ఎనిమిది వాహనాలు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ అని, మరో రెండు రక్షణ అవసరాల కోసం వినియోగించేవని సూచనప్రాయంగా తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం కలిగిన వాహనాలు కాబట్టి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి అనుమతి తప్పనిసరి అవసరం.
ఈ వాహనాల కాన్వాయ్‌లో ఒకదానికి పేలుడు పదార్ధాలను దూరం నుంచే కనిపెట్టగల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిసింది. మరో వాహనానికి మాత్రం అత్యవసర సమయాలలో వాహనం లోపలి నుంచే కాల్పులు జరపడానికి వీలుగా (యుద్ధశకటాల్లాగా) ‘వెపన్ మౌంటింగ్’ వ్యవస్థను సమకూరుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినియోగిస్తున్న కాన్వాయ్‌లో కూడా లాండ్ క్రూయిజర్ ప్రాడో వాహనాలే ఉన్నాయి. ఇకపైన కేటీఆర్‌కు కూడా సీఎం అయిన తర్వాత ఈ కంపెనీ మోడల్ వాహనాలనే లేటెస్ట్ రకానివి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ముఖ్యమంత్రులు, వీఐపీలు (సెక్యూరిటీ అవసరమైనవారు) వాడే వాహనాలు, కాన్వాయ్‌కు సంబంధించి పూర్తి వివరాలు బైటకు పొక్కకుండా ఇంటెలిజెన్స్ అధికారులు గోప్యత పాటిస్తుంటారు. ఇప్పుడు కేటీఆర్ కొత్త కాన్వాయ్ విషయంలోనూ ఈ అంశాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే వాహనాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈ వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సమాచారం. రెండు నెలలలో ఇవి ప్రభుత్వానికి అందుతాయని తెలిసింది.
ఒక్కో వాహనం కోటిన్నర
కాన్వాయ్‌లో వినియోగించాలనుకుంటున్న ఒక్కో లాండ్ క్రూయిజర్ వాహనం ఖరీదు సుమారు కోటిన్నర రూపాయలు ఉంటున్నట్లు అంచనా. బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఆయుధాలను వాహనం లోపలి నుంచే వాడడానికి వీలైన వ్యవస్థ తదితరాలన్నింటికీ అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రాత్రి సమయాలలో సైతం ఎక్కువ దూరం, పరిసరాలను గమనించేలా అన్ని వాహనాలలో నైట్ విజన్ కెమెరా వ్యవస్థను కూడా సమకూరుస్తున్నట్లు సమాచారం. మైన్ ప్రూఫ్ వాహనం కాకపోయినప్పటికీ ఏదేని అవాంఛనీయ పరిస్థితులలో ఇంధనం టాంకుకు ఇబ్బంది లేకుండా దానికి కూడా పటిష్టమైన రక్షణ కల్పించే టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి కాన్వాయ్ అవసరాల కోసం ఈ పది వాహనాలను సమకూర్చుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నా నిర్దిష్ఠంగా కేటీఆర్ సీఎం అయిన తర్వాత వినియోగించడం కోసమే అనే అంశాన్ని మాత్రం వారు ధ్రువీకరించడంలేదు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా వారి అవసరాల కోసం సమకూర్చుకుంటున్నవే అని పేర్కొంటున్నారు. కాన్వాయ్‌లోని వాహనాలు తెలుపులో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వాహనాల ప్రత్యేకతలకు సంబంధించి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. పది వాహనాలకూ బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యాన్ని సమకూరుస్తున్నట్లు తెలిసింది.
మూడేళ్లకోసారి మార్చడం ఆనవాయితీ
ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం వాడే వాహనాలను మూడేళ్లకోసారి మార్చడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈసారి పది కొత్త వాహనాలను కొంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు కేసీఆర్ వినియోగిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలు 2018లో వచ్చాయి. మూడేళ్ల కాలం తీరిపోతుండడంతో కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. కేటీఆర్ కొత్తగా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న సమయంలో కాన్వాయ్‌లోకి పది కొత్త వాహనాలు సమకూరుతుండడంతో అది కేటీఆర్ కోసమేననే అభిప్రాయం నెలకొంది. గతంలో బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యంతో తయారైన బస్సును పంజాబ్ రాష్ట్రంలో తయారుచేయగా ఈసారి కాన్వాయ్‌లోని లాండ్ క్రూయిజర్ వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం మాత్రం హైదరాబాద్‌లోనే సమకూరుస్తున్నట్లు సమాచారం.
టొయోటా కంపెనీ తయారుచేస్తున్న లాండ్ క్రూయిజర్ వాహనాలు సహజంగా 1+7 (డ్రైవర్ కాకుండా మరో ఏడుగురు కూర్చునేలా) సీటింగ్ కెపాసిటీతో వస్తాయి. కాన్వాయ్ అవసరాల కోసం వినియోగిస్తున్నందున 1+4 సీటింగ్ మాత్రమే ఉండాలని ఆ వాహనాలను సమకూరుస్తున్న డీలర్‌కు ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేక సూచనలు చేశారు. కంపెనీ నుంచి వాహనాలు ఎలా వచ్చినా వాటిలో సీటింగ్ అరేంజ్‌మెంట్ మాత్రం ఇంటెలిజెన్స్ అధికారుల సూచన ప్రకారమే మార్పులు చేర్పులు జరుగుతాయి. సుమారు నాలుగున్నర వేల క్యూబిక్ కెపాసిటీ (4461 సీసీ) సామర్థ్యం కలిగిన ఈ వాహనాల ధర ప్రస్తుత మార్కెట్‌లో రూ. 1.47 కోట్లు ఉన్నా అవసరమైన సౌకర్యాలన్నింటినీ సమకూర్చుకోడానికి భారీ స్థాయిలోనే ఖర్చు కానుంది. కాన్వాయ్‌లోని మొత్తం వాహనాలూ భారత్-6 కాలుష్య ప్రమాణాలతో ఉండనున్నాయి.