- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండేళ్లుగా వారికి మరుగుదొడ్డే ఇల్లు.. రాత్రి అత్త, కోడలు ఆరుబయటే..
దిశ, జడ్చర్ల : ఏడేళ్లుగా వారికి ఇల్లంటే ఏంటో తెలియదు. మరుగునపడ్డ వారి జీవితాలకు మరుగుదొడ్డే కేరాఫ్‌గా మిగిలింది. పెద్దదిక్కును కోల్పోయి ఒకవైపు, పట్టించుకునే నాథుడు లేక మరోవైపు, కన్న బిడ్డలను పెట్టుకొని కడుపు బాధతో కన్నీటిని దిగమింగుతూ కాలం వెల్లదీస్తోంది ఆ కుటుంబం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలం తిరుమలగిరికి చెందిన గుమ్మడి బాలయ్య ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.
అప్పటిదాకా ఏ లోటు లేని ఆ కుటుంబానికి కష్టాలు ఒక్కొక్కటిగా వచ్చి శిరోభారంగా మారాయి. అప్పటి నుండి భార్య సుజాత తన ఇద్దరు పిల్లలు భాను, వినీలతో పాటుగా తన అత్త అంజుమ్మలు కలిసి ఒకే దగ్గర జీవిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. భర్త చనిపోయిన నాటి నుండి వారికున్న చిన్నపాటి ఇల్లు కూడా కూలిపోవడంతో గ్రామంలో ఉన్న ఓ కమిటీ హాల్‌లో కొన్నాళ్లపాటు తలదాచుకున్నారు. అయితే గ్రామ కమిటీ హాల్‌లో సామాగ్రిని నిలువ ఉంచేందుకు గ్రామ పెద్దలు వారిని అక్కడి నుండి ఖాళీ చేయించడంతో చేసేది ఏమీ లేక వారి సొంత ఇంటి స్థలం ఆవరణలోని ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్డి గదిని ఇంటిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలా రెండేళ్లుగా మరుగుదొడ్డి గదిలోనే వంటావార్పు చేసుకుంటూ తన పిల్లలని గదిలోనే పడుకోబెట్టి అత్తా, కోడలు సుజాత మాత్రం ఆరుబయట నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఇటీవల కురిసిన వర్షాలకు తడుస్తూ, ఎండుతూ మరో చోట గూడు లేక, చెప్పుకునే నాథుడు లేక దుర్భర జీవితాన్ని కొనసాగిస్తోంది ఆ కుటుంబం. చూసేవారు అయ్యో పాపం అనడమే కానీ.. ఆదుకునే నాథుడు లేక పట్టించుకునే నాయకులు లేక వారి కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీటి బాధను కడుపులో పెట్టుకొని సాయం చేసే వారి కోసం ఎదురుచూడాల్సిన దీన పరిస్థితి నెలకొంది.
ఈ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తమ ఇల్లు కూలిపోయి దిక్కులేక ఆశ్రయం కోసం మరో ఏడెనిమిది కుటుంబాల దాకా ఎదురు చూస్తున్నాయి. ఇలా ఈ గ్రామంలో ఎవరిని కదిలించినా కష్టాల దృశ్యాలే మనసుల్ని కలచి వేస్తున్నాయి. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా దాదాపుగా తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అవస్థలు పడుతూ దుర్భర జీవితం గడుపుతున్న సుజాతమ్మ దీనస్థితిని అటు ప్రభుత్వం.. ఇటు సామాజిక సంఘ సేవకులు గానీ, గ్రామ పాలకులు కూడా గుర్తించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గూడు లేని నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
- Tags
- home
- mahbubnagar