తెలంగాణలో ఒక్కరోజే 352 కేసులు

by vinod kumar |
తెలంగాణలో ఒక్కరోజే 352 కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కట్టడి సంగతేమో గానీ, వైరస్ వ్యాప్తి మాత్రం కట్టలు తెంచుకుంటోంది. ఊహకు అందని విధంగా ఒక్క రోజులోనే ఏకంగా 352 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా వైరస్ మరింత విజృంభిస్తోంది. పరిస్థితి గతంకన్నా తీవ్రంగా ఉందని టీఆర్ఎస్ ప్రముఖ నేత ఒకరు వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే గరిష్ట స్థాయిలో కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటిదాకా మంత్రులు క్వారంటైన్‌లోకి వెళ్ళారు, ఎమ్మెల్యేలు పాజిటివ్ వచ్చి ఐసొలేషన్‌లోకి వెళ్ళిపోయారు.. ఇప్పుడు వివిధ కార్పొరేషన్ల పెద్దలు పాజిటివ్ నిర్ధారణ అయ్యి గాంధీ ఆస్పత్రిలో చేరారు. విపక్షంలోని ప్రజా ప్రతినిధులకు పాజిటివ్ అని తేలింది. ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్న డాక్టర్లలో 79 మందికి పాజిటివ్ సోకినట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ స్వయంగా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.దీనికి మరో ఇద్దరు సరోజినీ ఆస్పత్రి డాక్టర్లు కూడా గురువారం తోడయ్యారు.

రాష్ట్రంలో కొత్తగా నమోదైన 352 కేసుల్లో 302 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,027కు చేరుకుంది. కరోనా కారణంగా ముగ్గురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 195కు చేరుకుంది. హైదరాబాద్‌ నగరాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్‌ జిల్లాలో 10 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ రాష్ట్రం మొత్తానికి వ్యాపించిందంటూ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన గంటల వ్యవధిలోనే మంచిర్యాలలో నాలుగు, జగిత్యాల, వరంగల్ అర్బన్‌లో మూడు, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రెండు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.
రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్ పెద్దకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. సరోజిని ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులకు కూడా కరోనా సోకింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇద్దరు జోనల్ కమిషనర్ స్థాయి అధికారులకు కూడా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.

Advertisement

Next Story