‘వారం రోజుల్లో పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటన’

by Shyam |
‘వారం రోజుల్లో పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటన’
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మరో వారం రోజుల్లో పీఆర్సీపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన నాంపల్లి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… మరో మూడు రోజుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను కలువనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 18వ తేదీన సీఎస్‌ను కలిసి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని, పీఆర్సీ ప్రతిని ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలని కోరుతామన్నారు. పీఆర్సీ ప్రతిని పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపి మెరుగైన ఫిట్ మెంట్ దిశగా ఉద్యోగ జేఏసీ కృషి చేస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులపై ఉన్న పని భారం తగ్గించాలని, ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకం నుంచి పంచాయతీ కార్యదర్శులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిపారు. అంతేగాకుండా ప్రతి గ్రామపంచాయతీకి ఒక అసిస్టెంట్‌ను నియమించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కల్పించేందుకు అర్హత సర్వీస్ మూడు నుంచి రెండేళ్లకు తగ్గించాలని, దీంతో ఈ ఒక్క విభాగంలోనే సుమారు 700 మందికి పదోన్నతులు లభిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, పంచాయత్ రాజ్ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు పర్వతాలు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story