తెలంగాణ ప్రజలను మెప్పించని టీజేఎస్..!

by Anukaran |
తెలంగాణ ప్రజలను మెప్పించని టీజేఎస్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కోదండరామ్ నాయకత్వంలో ఏర్పడిన కొత్త రాజకీయ పార్టీ విజయవంతంగా ముందుకు సాగలేకపోతోంది. 2014కు ముందు కేసీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమానికి దశాదిశా నిర్ధేశనం చెందిన ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ నాయకుడిగా ప్రజలను మెప్పించలేకపోతున్నారు. యూనివర్సిటీలు, విద్యార్థులు, లెక్చరర్లను ఏకతాటి మీదకు తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసినా.. రాష్ర్టం ఏర్పడిన తర్వాత సరైన గుర్తింపును ఆయన పొందలేకపోయారు. స్వరాష్ట్రంలో సాధించాలనుకున్న పనులకు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేకపోవడాన్ని ఆయన గమనించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాజకీయ వేదిక అవసరమని భావించి అప్పటి వరకూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్)ను తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీని 2018 మార్చి 31న స్థాపించారు. కేసీఆర్ ను వ్యక్తిగతంగానూ, ప్రభుత్వపరంగా సాగుతున్న నియంతృత్వం పోకడలపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ కోదండరామ్ పార్టీని రాజకీయంగా బలం పెంచుకోవడంలో వెనకబడుతున్నారన్నది స్పష్టం.

టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం వ్యవహరిస్తున్నప్పటికీ.. పార్టీ రాజకీయ బలాన్ని పెంచుకునేదిశగా కదలికలు లేకపోవడంతో ప్రధాన అడ్డంకిగా కనబడుతోంది. విద్యావేత్తగా విషయాన్ని సూక్ష్మీకరించి, వ్యక్తీకరణ చేయడంలో కోదండరామ్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ టీజేఎస్ ను పూర్తి రాజకీయ పార్టీ పంథాలో నడిపించే అనుభవం, నైపుణ్యం లోపాలుగా కనిపిస్తున్నాయి. పార్టీకి ఉన్న విద్యార్థి, యువజన విభాగాలు కీలకంగా వ్యవహరిస్తుండటమే టీజేఎస్ కు ప్రధాన బలంగా కనిపిస్త్తోంది. టీజాక్ గా ఉన్నప్పటి నుంచే విద్యార్థి, యువత సమస్యల మీద పోరాటాలు నిర్వహిస్తూ వస్తోంది. కోదండరామ్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘నిరుద్యోగ బతుకు దెరువు యాత్ర’ ఆ పార్టీ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటి. ఇక కౌలు రైతులకు రైతు బీమా పథకాలను వర్తింపజేయాలని టీజేఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే సాంప్రదాయ రాజకీయ పార్టీలకు ఉండే సహజ లక్షణాలు టీజేఎస్ లో కనిపించవు.

కోదండరాం మినహా ఇతర ప్రధాన నాయకులు అంతగా తెరమీద కనిపించారు. పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ రాజకీయ విమర్శలకు, అధికార పార్టీని దునుమాడటంలోనూ కోదండరాం కొంత మెతక వైఖరితోనే కనిపిస్తారు. రాజకీయంగానూ మహాకూటమి పొత్తులో ఉన్నప్పటికీ ఆ పార్టీకి చెప్పుకోదగ్గ సానుకూల ఫలితాలేమీ రాలేదు. గతేడాది డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గాను నాలుగు కార్పొరేటర్ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఆ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ప్రధాన పోటీదారుల జాబితాలో లేరు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రాజకీయమైన ప్రభావం ఉంటే అది రాష్ట్రమంతా ఉండే అవకాశముంది. పట్టభద్రుల ఎన్నికల్లోనూ స్వయంగా కోదండరామ్ పోటీ చేయగా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంది. గ్రాడ్యూయేట్స్, ఉపాధ్యాయులు మాత్రమే ఓటు వేసే పట్టభద్రుల స్థానంలోనూ పోటాపోటీగా నిలిచినప్పటికీ టీజేఎస్ కు విజయం సాధించడం అంత సులభమేమీ కాదని తేలిపోయింది.

తాత్కాలిక రాజకీయ లక్ష్యాలతో నష్టం

తెలంగాణ జనసమితిలో మేధావులు, లెక్చరర్లు, విద్యార్థి నాయకులు ఎక్కువగా ఉండటం ఆ పార్టీకి ప్రధాన బలం కాగా.. రాజకీయ పంథా ధోరణులను అనుసరించలేకపోవడం, గుర్తించకపోవడంతో నష్టపోతోంది. టీఆర్ఎస్, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడమర్చి చెప్పడంలోనూ, ఉద్యమాలకు నాయకత్వం వహించడంలోనూ టీజేఎస్ కు మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. అయితే నిర్మాణాత్మక లోపంతో టీజేఎస్ దాన్ని దాటలేకపోతోంది. రైతు, విద్యార్థి సమస్యలపై పోరాడేందుకు ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తున్నప్పటికీ శాశ్వతంగా రాజకీయ బంధాలను నెరపడంలో పార్టీ నాయకత్వం వెనకబడుతోంది. యూనివర్సిటీల్లో వీసీలు, ఇతర స్టాఫ్ నియామకాల కోసం పోరాటాలను నిర్మించడంతో పాటు జాబ్ క్యాలెండర్ కోసం టీజేఎస్ నిరంతరం కొట్లాడింది. ఎన్నికల సందర్భాల్లోనూ, రైతులు, విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ఇతర పార్టీలను కలుపుకుని ఉద్యమాలను చేస్తోంది.

రాజకీయ స్వభావం లేని టీజేఎస్ తో పొత్తు, సహకారం విషయాలను కూడా ఇతర రాజకీయ పార్టీలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఉదాహరణకు మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీజేఎస్ కు తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కూటమిలోని ఇతర పార్టీల నుంచి అనుకున్న మేరకు మద్దతు లభించలేదనే చెప్పాలి. తాజాగా జరుగుతున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి టీజేఎస్ ప్రయత్నిస్తున్నా.. ఎజెండాలుగా విడిపోయిన రాజకీయ పార్టీల కారణంగా టీజేఎస్ కు సరైన పట్టు లభించడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఉమ్మడిగా వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లోనూ.. నాయకత్వ స్థానాన్ని భర్తీ చేయగల బాధ్యత, అవకాశం టీజేఎస్ కే ఉంది. అయితే అది చాలా కాలంగా దాన్ని సాధించలేకపోతున్నట్టు పార్టీ అంతర్గతంగా గుర్తిస్తోంది. ఉమ్మడి శత్రువుగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా టీజేఎస్ పనిచేస్తోందని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేస్తోంది.

Advertisement

Next Story