తుంగతుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు !

by Shyam |
తుంగతుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయం అంటే నల్గొండ. అక్కడ అంతే స్పెషల్ అట్రాక్షన్ తుంగతుర్తి గడ్డ. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో బడానేతలు మొత్తం ఈ జిల్లా నుంచే చక్రం తిప్పినా.. తుంగతుర్తి అనగానే ప్రజల పల్స్‌ పట్టేందుకు సైలెంట్ కావల్సిందే. కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో అన్నిపార్టీలు తమ జెండాను రెపరెపలాడించాయంటే ఓటర్లు ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఎలాంటి వ్యూహాలతో రాజకీయ నేతలను అందలమెక్కిస్తారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మల్లు స్వరాజ్యం, దామోదర్‌రెడ్డి, సంకినేని, మోత్కుపల్లి నుంచి నేటి గాదరి కిశోర్‌ వరకు అందరూ ఇక్కడి నుంచే గెలిచిన వారే. వీరందరిదీ ఒక్కో పార్టీ. అయితే గత 15ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో చప్పుడు లేకుండా రాజకీయం సాగుతుండగా కొద్దిరోజుల నుంచి హస్తంపార్టీలో వర్గపోరు మొదలైంది. రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు వరకు వెళ్లింది. అయితే ఇక్కడ గ్రూపు రాజకీయాలు ఎందుకు మొదలయ్యాయో ఓసారి పరిశీలిస్తే..

తుంగతుర్తి నుంచి 2004లో గెలిచిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి.. ఈ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో 2009లో సూర్యాపేటకు వెళ్లి అక్కడి నుంచి గెలుపొందారు. ఆ సమయంలో ఇక్కడి నుంచి మహాకూటమి నుంచి మోత్కుపల్లి నర్సింహులు విజయం సాధించారు. ఇదే క్రమంలో 2014లో టీఆర్ఎస్ నుంచి గాదరి కిశోర్‌ ఎమ్మెల్యే‌ అయ్యారు. ఈ ఎన్నికల్లోనే కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కూడా ఆయనే బరిలోకి దిగి కిశోర్ చేతిలో పరాజయం చెందారు. అయితే దామోదర్‌రెడ్డి సూర్యాపేటకు షిప్ట్ అయినప్పటికీ తుంగతుర్తి నియోజకవర్గంపై ఆయన ముద్ర ఉంటుంది. తన అనుచరులకు టికెట్ ఇప్పించేందుకు అధిష్ఠానంతో మాట్లాడి చివరి వరకు ప్రయత్నాలు సాగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషంలో దామోదర్‌రెడ్డి వర్గీయుడైన రవికుమార్‌కు టికెట్‌ దక్కిందని ప్రచారం జరిగి.. మళ్లీ అద్దంకి దయాకర్‌కే కన్ఫామ్ కావడంతో.. వర్గపోరుకు మరింత అగ్గి రాజేసినట్లు అయ్యింది.

నల్గొండ జిల్లాలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డిలకు ఒకరంటే ఒకరికి పడదని రాజకీయాల్లో బహిరంగంగా జరిగే ప్రచారం. కానీ ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే అందరూ ఒక్కటై రాష్ట్ర రాజకీయాలపై ముద్ర వేస్తారని టాక్ ఉంది. అయితే అద్దంకి దయాకర్‌కు కోమటిరెడ్డి బద్రర్స్‌ అండ ఉందని అక్కడి నియోజకవర్గంలో జనాలకు తెలిసిన మాట. ఈ నేపథ్యంలోనే దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డికి గ్రూప్ గొడవల విషయం తుంగతుర్తిపై పట్టు బిగుస్తోందని, అందువల్లే ఇక్కడ వర్గపోరు నడుస్తోందని జనాల నోళ్లలో నానే అంతర్గత రహస్యం. దీంతో నియోజకవర్గ నేతల గొడవలతో మొదలైన పంచాయతీ ఇప్పుడు దామోదర్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌ మధ్యగా మారి రాష్ట్రస్థాయిలో ఫిర్యాదులు చేసుకున్నారు. తనను కులం పేరుతో దూషించారని అద్దంకి దయార్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కు చెప్పగా ఎలాంటి స్పందన రాకపోవడంతో సోనియా గాంధీకి లేటర్ రాసిన విషయం ఇటీవల వెలుగు చూసింది.

రాష్ట్ర నేతలతో పాటు, ఢిల్లీ నుంచి సైతం న్యాయం జరుగుతలేదని భావించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ 10రోజుల క్రితం హైదరాబాద్ బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి, సీనియర్ నేత దామోదర్‌రెడ్డి తనను బెదిరిస్తున్నారని, కాంగ్రెస్‌లో బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతుందన్నారు. తనకు సోనియా, రాహుల్‌ గాంధీ స్వయంగా టికెట్ ఇచ్చినా దామోదర్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని, టీఆర్ఎస్‌కు కోవర్టుగా పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో దామోదర్‌రెడ్డి, అద్దంకి దయార్‌ల పంచాయతీ చర్చనీయాంశమై… నియోజకవర్గంలోని పార్టీ నేతలు పోటాపోటీగా ప్రెస్‌మీట్లు పెట్టి ఖండిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తన అనుచరుడైన రవికి టికెట్ ఇప్పించాలని దామోదర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా.. మళ్లీ కూడా దయాకర్‌కే టికెట్ వస్తుందని ఆయన సన్నిహితులు మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇన్నిరోజులు రాష్ట్రస్థాయిలో గాంధీభవన్‌ వేదికగా గొడవలు పెట్టుకున్న నేతలు.. జిల్లాలో ఎవరి నియోజకవర్గంలో వారే రాజకీయాలు నడిపారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో గొడవలను రాష్ట్రస్థాయి నుంచి ఢిల్లీలో అధినేత్రి దగ్గరకు తీసుకెళ్లడమే గాకుండా పోలీస్‌ స్టేషన్ల మెట్లు ఎక్కించడం కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ఏవిధంగా ఉంటాయన్నది స్పష్టం చేస్తుంది. అయితే వచ్చేఎన్నికల్లో ఎవరికి టికెట్‌ వచ్చినా నేతలంతా కలిసే పనిచేస్తారా లేకుంటే తమ వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ రాలేదన్న కోపంతో చివరకు టీఆర్ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు ‘హ్యాండ్’ ఇస్తారా అన్నది నియోజకవర్గ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న.

Advertisement

Next Story