ఫ్రెండ్ రిక్వెస్ట్‌ కన్ఫామ్.. 16లక్షల మోసం !

by Shyam |
ఫ్రెండ్ రిక్వెస్ట్‌ కన్ఫామ్.. 16లక్షల మోసం !
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మీ సామాజిక సేవా కార్యక్రమాలు బాగున్నాయంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టి రూ.16లక్షలకు పైగా కాజేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహిళలకు విద్యా బోధనలో మెళకువలు, కంప్యూటర్ కోర్సుల్లో ఉపాధి అవకాశాలకు శిక్షణ అందిస్తున్న మహిళకు జర్మనీకి చెందిన జేమ్స్ డోనాల్డ్ పేరిట సెప్టెంబరు 28న ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె యాక్సెప్ట్ చేయడంతో.. మీ సేవా కార్యక్రమాలు బాగున్నాయంటూ సాన్నిహిత్యం పెంచుకొని వ్యక్తిగత వివరాలతో పాటు ఫోన్ నెంబర్లను మార్చుకున్నారు. అనంతరం వాట్సాప్ చాట్ చేసేంత సాన్నిహిత్యం పెరిగింది. ఇదే క్రమంలో మీ సొసైటీకి సాయం చేస్తానని చెప్పి గిఫ్ట్ బ్యాగ్ ఫోటోను వాట్సాప్‌లో పంపిన అతడు… ఆ బహుమతిని ఎయిర్‌పోర్టులో సేకరించడానికి రూ.370 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించాడు.

అదే సమయలో.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకుంటూ మరో వ్యక్తి 85279 80439 నెంబరు నుంచి ఫోన్ చేసి.. పార్శిల్ బ్యాగ్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ధర మార్పిడి తదితర ఫీజుల పేరుతో మొత్తం రూ.16.74లక్షలను చెల్లించాలని చెప్పడంతో వివిధ బ్యాంకు ఖాతాలకు బాధితురాలు నగదును ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత అవతలి వ్యక్తుల ఫోన్లు స్విచ్ఛాప్ కావడంతో మోసపోయానని గ్రహించి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్న వ్యక్తిని నైజిరియాకు చెందిన వీఐపీ అలియాస్ ఓనెక ఇజికెగా గుర్తించారు. ఈ మోసంలో ఆరుగురు నిందితులు ఉండగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పాస్‌పోర్ట్, 10 డెబిట్ కార్డులు, 10మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story