పాపం… ఈ నెల కూడా పాత వేతనాలే!

by Shyam |   ( Updated:2021-08-08 22:33:22.0  )
employees
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వేతన సవరణపై క్లారిటీ కరువైంది. ప్రభుత్వ శాఖల్లో పని చేసే 9.20 లక్షల మందికి 30 శాతం ఫిట్​మెంట్​ ఇస్తున్నట్లు సీఎం మార్చి 22న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వేతన సవరణ నెలల తరబడి సాగింది. ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల పెరిగిన వేతనాలు జమ అవుతున్నాయి. కానీ అదే 30 శాతం పెరిగిందని సంబురపడిన ఆరున్నర లక్షల మంది ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. పంచాయతీ కార్యదర్శులతో పాటుగా కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ఉద్యోగులు, సెర్ప్​, ఉపాధి హామీ ఉద్యోగులకు పాత వేతనాలే జమ అయ్యాయి.

ఎప్పడు ఇస్తారో..?

ఉద్యోగుల వేతనాల విషయంలో ప్రభుత్వ తీరు అధ్వానంగా మారిందని ఆరోపిస్తున్నారు. ప్రతినెలా వేతనాలను ఆలస్యం చేస్తూ చిన్న చిన్న పద్దులను సైతం వెనకేసుకుంటుందంటున్నారు. వాస్తవంగా ఈ నెల పెరిగిన వేతనాలు అందుతాయని ఆశపడ్డారు. పీఆర్సీ నివేదికలో కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు కనీస వేతనం రూ.19 వేలుగా సూచించినా ప్రభుత్వం 30 శాతం ఫిట్​మెంట్​నే అమలు చేసింది. దీంతో రూ.12 వేలతో పని చేస్తున్న ఉద్యోగులకు రూ.15వేలకు చేరింది. ఇలా 30 శాతం ఫిట్​మెంట్​తో సర్దుబాటు చేసినా.. మూడు నెలలు రాకుండా పోయాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్, మే నెలల్లో ఏరియర్స్​ ఇస్తుండగా జూన్​ నెల వేతనాలను ఇటీవల చెల్లించారు. జులై వేతనాలను మాత్రం పెరిగిన స్కేల్​తో విడుదల చేస్తున్నారు. కానీ కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్, సెర్ప్, ఉపాధి హామీతో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మాత్రం అమలు చేయలేదు. జూనియర్ ​పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం రూ.15 వేలు ఇస్తుండగా.. గత నెలలో రూ.28,719కి పెంచారు. ఈ వేతనాన్ని జూలై నుంచే అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఈ నెల జేపీఎస్​లకు రూ.15 వేల చొప్పున చెల్లించారు. ఇప్పటికే మూడు నెలల ఏరియర్స్​ను కోల్పోయిన ఈ ఆరున్నర లక్షల మంది ఉద్యోగులు ఈ నెల కూడా కోల్పోయినట్లేనని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed