వైఎస్ అభిమానులను ఏకం చేయాలి.. ఖమ్మంలో షర్మిల ప్లాన్..!

by Anukaran |   ( Updated:2021-02-24 13:44:16.0  )
వైఎస్ అభిమానులను ఏకం చేయాలి.. ఖమ్మంలో షర్మిల ప్లాన్..!
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు ఖాయంగానే కనిపిస్తోంది. అంతర్గతంగా కార్యాచరణ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల అన్ని జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు పలుమార్లు షర్మిలతో సమావేశమయ్యారు. ఈ నెల 21న ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన ర్యాలీ, ఆత్మీయ సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లో పలు జిల్లాల నేతలతో సీరియస్ గా పార్టీకి సంబంధించి మంతనాలు మొదలు పెట్టినట్లు కూడా సమాచారం. అయితే పార్టీ ఇంకా పురుడు పోసుకోకముందే ఇప్పుడు కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచే షర్మిల బరిలోకి దిగుతారని, ఇక్కడి నుంచే జనాల్లోకి వెళ్లేందుకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి అభిమానులను ఏకం చేసేందుకు హైదరాబాద్ లేదా ఖమ్మంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

మార్చి నెలాఖరులో సభ..?

ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశమవుతున్న షర్మిలను ఉమ్మడి ఖమ్మం నేతలు మాత్రం పలుమార్లు కలిసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మార్చి నెలాఖరులో ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసే ఆలోచన ఉండడంతో ఆ నేతలతో షర్మిల సమావేశం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నుంచే జనాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆమెను కలిసిన వారు చెబుతున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సభతో ప్రజాబలాన్ని చూపించేందుకు సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది.

ఖమ్మం నుంచే ఎందుకు..?

ఖమ్మం నుంచే షర్మిల కార్యాచరణ ప్రారంభిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత కొండా రాఘవ రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఖమ్మం కోడలంటూ చెప్పారు. ఆయన అలా మాట్లాడడానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే రాజశేఖర్ రెడ్డి అభిమానాలు ఎక్కువగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. షర్మిల ఖమ్మంలో పాదయాత్ర చేసినప్పుడు జిల్లా ప్రజలే ఎక్కువగా ఆదరించారని అంటారు.

అంతేకాదు 2014లో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం నుంచి వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. రాష్ట్రం అంతటా టీఆర్ఎస్ హవా నడిస్తే ఉమ్మడి జిల్లాలో మాత్రం ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు వైరా, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. మిగతా నియోజకవర్గాల్లో కూడా చెప్పుకోదగిన స్థాయిలో ప్రభావం చూపించగలిగింది. ఇప్పుడు కూడా ఆ అభిమానమే తనను నడిపిస్తోందని షర్మిల విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం కోడలిగా తెలంగాణలో రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

షర్మిలను కలిసిన ఖమ్మం నేతలు..

ఇప్పటికే షర్మిలను పలు దఫాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు నేతలు కలిశారు. పార్టీ పెడితే తామంతా సహకరిస్తామని తెలిపారు. అన్ని పార్టీల నుంచి కూడా ముఖ్యనేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లు సమాచారం. సుమారు 200 మంది నేతలతో జరిగిన సమావేశంలో ఖమ్మం జిల్లా నుంచే జనాల్లోకి వెళ్లాలని అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

షర్మిల పార్టీవైపు చూస్తున్న నేతలు..?

షర్మిల పార్టీ పెడుతుందని ఓ క్లారిటీకి వచ్చిన నేతలు ఇప్పుడు అటువైపు చూస్తున్నట్లు సమాచారం. అన్ని పార్టీల నుంచి వలసలు ఉండొచ్చనే ఊహాగానాలు సైతం జోరందుకున్నాయి. ఇప్పటికే కొంత మంది సీనియర్ నేతలను సైతం షర్మిల టీం సంప్రదించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా షర్మిల పార్టీ పెడితే రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ప్రభావం ఉండబోతుందనే వార్తలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఖమ్మం కోడలేనా..?

షర్మిల పార్టీ పెడుతుందనగానే అన్ని పార్టీల నేతల మళ్లీ తెలంగాణపై ఆంధ్రా పెత్తనం మొదలవుతుందని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఆంధ్రా వెళ్లి రాజకీయాలు చేసుకోవాలంటూ ధ్వజమెత్తుతున్నారు. అయితే షర్మిల పక్కా తెలంగాణ కోడలని, ఆమె పుట్టింది కూడా హైదరాబాదేనని వాదిస్తున్నారు ఆమె వెంట నడిచేవారు.

ఎవరీ ‘లక్కినేని’..

లక్కినేని సుధీర్.. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో షర్మిల పార్టీకి సంబంధించి వ్యవహారాలు చూస్తున్నారు. గతంలో వైసీపీకి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. లక్కినేని కుటుంబానికి జిల్లాలో మంచి రాజకీయ ప్రస్థానమే ఉంది. 1964లో లక్కినేని సుధీర్ పెద్దనాన్న లక్కినేని నర్సయ్య సుమారు 14 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావును రాజకీయంగా ప్రోత్సహించింది ఆయనే. సుధీర్ తండ్రి కూడా ఇందిరా కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నాలుగేళ్లు చేశారు. సుధీర్ సోదరుడు లక్కినేని జోగారావుపైనే తుమ్మల నాగేశ్వరరావు మొదటి సారి సత్తుపల్లిలో గెలిచారు. మరో సోదరుడు లక్కినేని సురేందర్ సైతం రాజకీయంగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తే. లక్కినేని సుధీర్ 2016లో వైసీపీ చేరి పార్టీ బాధ్యతలు చూశారు. ప్రస్తుతం షర్మిల పార్టీకి సంబంధించిన జిల్లా వ్యవహారాలను చూస్తున్నారు.

Advertisement

Next Story