- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
700 ఏళ్ల చరిత్ర.. 5వేల మందికి బోధన.. కళే ప్రాణంగా..
దిశ, ఫీచర్స్: రాజస్థాన్‌లోని భిల్వారా ప్రాంతంలో ఉద్భవించిన ఓ జానపద కళారూపమే ‘ఫడ్’ లేదా ‘ఫోల్డ్ పెయింటింగ్స్’. 700 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆర్ట్ తొలిగా దేవనారాయణ, పాబుజీ వంటి జానపద దేవతల కథలను వర్ణించడానికి ఉపయోగించారు. భోపా అనే పూజరి అతడి భార్య భోపి స్క్రోల్ పెయింటింగ్‌తో ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతూ ఒకరు రావణహట్ట వాయిద్యం వాయిస్తే, మరొకరు నృత్యం చేస్తూ కథలు వినిపించేవాళ్లు. ఈ నృత్యరూపకానికి ఫడ్ పెయింటింగ్‌లను దృశ్య సహాయకంగా ఉపయోగించేవాళ్లు. ఈ మౌఖిక కళారూపానికి జనాకర్షణ పెరగగా ఆ తర్వాత రామాయణం, హనుమాన్ చాలీసా సహా ఇతర పౌరాణిక కథల నుంచి నాటకీయ కథనాలను ప్రదర్శించడం కొనసాగించారు.
30 అడుగుల పొడవు ఉన్న ఈ పెయింటింగ్‌లపై కళాకారులు దేవతల కథలను చిత్రీకరించినందున వాటిని ‘ట్రావెలింగ్ టెంపుల్స్’ అని కూడా పిలిచేవాళ్లు. కానీ కాలక్రమంలో దీనికి ఆదరణ తగ్గిపోగా కొంతమంది మాత్రం ‘ఫడ్’ కళకు జీవం పోసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో జోషి కుటుంబం ఒకటి. రాజస్థాన్, భిల్వారాకు చెందిన ఈ కుటుంబీకులు ఫడ్ పెయింటింగ్‌లకు సమకాలీన కథలను జోడించడం విశేషం.
50 సంవత్సరాల క్రితం వరకు చిప్ప తెగకు చెందిన జోషి వంశానికి చెందిన కళాకారులు ఫడ్ రూపాన్ని ప్రత్యేకంగా అభ్యసించేవారు. ఫడ్ కళను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడంలో, ఆ కళ ఇప్పటికీ బతికుండడానికి ఈ కుటుంబీకులే ప్రధాన కారణం. అత్యంత ప్రసిద్ధ ఫడ్ కళాకారుడైన లాల్ జోషి ఈ కళా రహాస్యాన్ని పదిమందికి నేర్పాలనే ఉద్దేశంతో ‘కళా కుంజ్’ అనే పాఠశాలను 1960 లో స్థాపించారు. ప్రస్తుతం ‘చిత్రశాల’గా పేరొందిన ఈ పాఠశాల జోషి కుటుంబం ఇతరులకు ఫడ్ ఆర్ట్ నేర్పుతుంది. జోషి కుమారులు కల్యాణ్, గోపాల్‌లు సాంప్రదాయ పద్ధతికి రాజీ పడకుండా కొత్త థీమ్‌లను పరిచయం చేయడం ద్వారా వారి తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ వేడుకలు, క్లైమేట్ చేంజ్, అటవీ వ్యవస్థలు, ఓటింగ్ మొదలైన దృశ్యమానమైన, సామాజికపరమైన అంశాలను ఫడ్ కళారూపాలుగా చిత్రీస్తున్నారు. అంతేకాదు గృహాలంకరణ, వస్త్రాలు, ఫర్నిషింగ్‌లు హస్తకళలు వంటి మాధ్యమాలపై ఈ చిత్రలేఖనాన్ని ప్రవేశపెట్టారు.
ఓపిక.. శ్రమ..
కల్యాణ్ చేపట్టిన అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ఒకటి రాజస్థాన్‌లోని షేఖావతి ప్రాంతంలో నీటి కొరత సంక్షోభాన్ని వర్ణిస్తుంది. ఎడారి ల్యాండ్‌స్కేప్‌కు వ్యతిరేకంగా, భూగర్భజలాల వెలికితీత కారణంగా గ్రామ చెరువులు, బావులు ఎండిపోయాయి. దీంతో ఇక్కడి ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఈ పెయింటింగ్ భూగర్భజలాలను రీచార్జ్ చేసే, నీటి సంక్షోభాన్ని తగ్గించే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ దృశ్యాలతో ఉంటుంది. ఇదే కాదు ప్రతీ పెయింటింగ్ కూడా ఎంతో ఓపికతో, కచ్చితత్వంతో చిత్రీకరించాలి. సమాన వెయిటేజీతో అంశానికి సంబంధించిన అన్ని సన్నివేశాలను కంపోజ్ చేయడం అతిపెద్ద సవాలు. అందువల్లే కళాకారులు స్క్రోల్‌ను నాలుగు భాగాలుగా విభజించి ప్రతి ఒక్కరికి కొన్ని సన్నివేశాలు కేటాయిస్తారు.
ఫడ్ పెయింటింగ్ వస్త్రం
చేతితో నేసిన వస్త్రాన్ని రాత్రిపూట నీటిలో నానబెట్టి, తర్వాత ఎండబెడతారు. థ్రెడ్‌లను మరింత మన్నికైనదిగా చేయడానికి, వస్త్రాన్ని మొక్కజొన్న పిండిలో (మైదా) ముంచి, చివరి దశలో దాన్ని మోహ్రా (ఒక రాయి), సాఫ్ట్ గోండు (జిగురు)ను ఉపరితలంపై రాస్తూ వస్త్రాన్ని మృదువుగా చేస్తారు.
పెయింటింగ్ టెక్నిక్..
కూరగాయలు, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు, రాళ్లతో తయారు చేసిన సహజ రంగులను మాత్రమే ఉపయోగిస్తారు. సాధారణంగా, పసుపును ఆభరణాలు, దుస్తులకి ఉపయోగిస్తే, ప్రకృతికి ఆకుపచ్చ, అవయవాలకు నారింజ, డెకర్ కోసం నీలం రంగులను వినియోగిస్తారు. రాజ బొమ్మలను రిప్రజెంట్ చేసేందుకు ఎరుపు రంగు పరిమితం చేశారు. పెయింటింగ్‌ను సజీవంగా తీసుకువచ్చే అవుట్‌లైన్‌తో రంగులను వేరు చేయడానికి బ్లాక్ కలర్ వాడతారు. కొందరు కళాకారులు మాత్రం తమ రచనలను ప్రత్యేకంగా చూపించడానికి కొన్ని రసాయన రంగులను వినియోగిస్తున్నారు.
తరతరాలకు..
జోషి కుటుంబం 5వేల మంది విద్యార్థులకు ఫడ్ పెయింటింగ్ నేర్పగా, వారిలో దాదాపు 200 మంది ఫడ్ పెయింటింగ్ వృత్తిపరంగా కొనసాగిస్తున్నారు. ఇక 1960లో ఫడ్ సమకాలీన కళకు లాల్ జోషి మార్గదర్శకత్వం వహించారు. ప్రపంచం ముందుకు సాగుతున్న కొద్దీ, దేవతల ఇతివృత్తాలతో పెయింటింగ్‌లను కొనుగోలు చేసే వ్యక్తులు తగ్గిపోయారు. కాబట్టి అతను రాజపుత్రుల చారిత్రాత్మక యుద్ధాలు, హోలీ, దీపావళి వంటి పండుగలను వర్ణించడం మొదలుపెట్టడంతో అవి జనాదారణ పొందాయి. దాదాపు 20 దేశాల్లో జోషి ఈ కళారూపకాన్ని ప్రదర్శించాడు.
ఫడ్ చిత్రకళకు సమకాలీన ఇతివృత్తాలను జోడించి ఈతరానికి కూడా ఆ కళను చేరువ చేస్తున్న 30వ తరం కళాకారుడు కల్యాణ్ జోషి. లాల్ జోషి తనయుడిగా కల్యాణ్ జాతీయ అవార్డుతో తన తండ్రి పేరును నిలబెట్టగా, మహమ్మారి ఇతివృత్తంతో ఓ విజువల్ డాక్యుమెంటేషన్ చేసి, సర్వత్రా అభినందనలు అందుకున్నాడు. వుహాన్‌లో ప్రారంభమైన కరోనావైరస్ ఎలా విశ్యవ్యాప్తమైందో కళ్లకు కట్టినట్లు చిత్రీకరించాడు. కొవిడ్ ప్రొటోకాల్స్‌తో పాటు ఇంటికి పరిమితమైన జనం, బాల్కనీలో ప్లేట్లు కొట్టడం, వీధి జంతువులకు ఆహారం ఇవ్వడం, డబ్బు దానం చేయడం మొదలైన ఎన్నో చిత్రాలకు అందులో చోటిచ్చాడు.
ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే విభిన్న సంస్కృతులు కూడా అందులో కనిపిస్తాయి. ఒకప్పుడు వినోద మాధ్యమంగా, పురాణ గాథలను చెప్పడానికి ఉపయోగించే ఫడ్, ప్రస్తుతం కొవిడ్ సహా, ఎన్నో సామాజిక అంశాలను ప్రతిబింబించేందుకు ఉపయోగపడుతుందని కల్యాణ్ అన్నాడు. ఇక తను చిత్రించిన పంచతంత్ర సిరీస్ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో భాగం కాగా తాను వేసిన ‘టీకా సిరీస్’ ఇటీవల భిల్వారా జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది. ఫడ్ భవిష్యత్తు ఆశాజనకంగా, ఉజ్వలంగా కనిపిస్తోందని కళ్యాణ్ తెలిపాడు.