రేషన్ దుకాణాల్లో థర్డ్ పార్టీ నిఘా..

by Shyam |
రేషన్ దుకాణాల్లో థర్డ్ పార్టీ నిఘా..
X

దిశ, హైదరాబాద్ :

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఉచిత బియ్యం పంపిణీలో పారదర్శకంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం థర్డ్ పార్టీ సిబ్బందిని ఏర్పాటు చేసింది. బియ్యం పంపిణీలో రేషన్ డీలర్లపై అనుమానాలు, సందేహాలు తలెత్తిన కారణంగానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు బియ్యం పంపిణీలో డీలర్లే వేలి ముద్రలు వేస్తుండగా, ప్రస్తుత థర్డ్ పార్టీ విధానం వల్ల డీలర్లు నామమాత్రం కానున్నారు. కార్డుదారుల సొంత దుకాణంలో బియ్యం తీసుకోవాలంటే థర్డ్ పార్టీ సిబ్బంది వేలిముద్ర తప్పనిసరిగా కావాల్సిందే. లేదంటే.. బియ్యం పంపిణీకి అవకాశం లేదు. ఇక పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలంటే మాత్రం సదరు కార్డుదారులు మాత్రమే వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం అనుకున్నట్టుగా నిజమైన కార్డుదారులకు మాత్రమే బియ్యం పంపిణీ జరగనుంది.

బియ్యం పంపిణీలో అక్రమాలకు చెక్..

సాధారణంగానే పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ అయ్యే బియ్యం పక్కదారి పడతున్నట్టుగా తరచూ వార్తల్లో వింటుంటాం. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం 12 కేజీల బియ్యం పంపిణీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, హైదరాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ 9 సర్కిళ్ళ పరిధిలో 674 రేషన్ దుకాణాలు ఉండగా.. మొత్తం 5.80 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారు. ప్రభుత్వ అధికారుల వివరాల ప్రకారం 12 కేజీల ఉచిత బియ్యాన్ని 5.54 లక్షల కార్డుదారులు తీసుకున్నారు. వీరితో పాటు నగరంలో నివసిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన 3.50 లక్షల కార్డుదారులు పోర్టబిలిటీ ద్వారా బియ్యం అందుకున్నారు. ఏప్రిల్ నెల పంపిణీ సమయంలో ఈ- పాస్ విధానంలో బయో మెట్రిక్ మిషన్ ద్వారా కార్డుదారుల నెంబర్ నమోదు చేసినప్పడు.. అప్పటికే బియ్యం తీసుకున్నట్టుగా చూపించడంతో అవాక్కవ్వడం కార్డుదారుల వంతయ్యింది. ఈ వ్యవహారంలో డీలర్లే బయో మెట్రిక్ మెషిన్‌లో కార్డు నెంబర్లను తప్పుగా నమోదు చేస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే, రాతపూర్వకంగా అధికారులకు ఎలాంటి ఫిర్యాదులు అందకున్నా.. విషయం మాత్రం అధికారుల దృష్టిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ తరహా అనుమానాలకు చెక్ పెట్టేందుకు పౌర సరఫరాల శాఖ థర్డ్ పార్టీ సిబ్బంది ద్వారా నిఘా పెట్టింది.

థర్డ్ పార్టీ పర్యవేక్షణ ఇలా…

రేషన్ దుకాణాల వద్ద బియ్యం తీసుకునేందుకు కార్డుదారుల నెంబర్ ఎంటర్ చేయగానే కుటుంబ సభ్యుల పేర్లు కనిపిస్తాయి. ఆ సమయంలో రేషన్ పొందే సభ్యుడు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతి సాధారణంగా జరిగేదే. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా బయోమెట్రిక్‌లో వేలి ముద్రను డీలరే వేసేందుకు అధికారులు ఏప్రిల్‌లో అనుమతించారు. ఈ తరహా పద్ధతి కారణంగా డీలర్లపై అనుమానాలు, విమర్శల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ థర్డ్ పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ ప్రకారం రేషన్ దుకాణం ప్రారంభించే సమయంలో మాత్రమే డీలర్ లాగిన్ అవుతాడు. ఆ తర్వాత అదే దుకాణంలో కార్డుదారుడికి బియ్యం సరఫరా చేసేందుకు అక్కడున్న థర్డ్ పార్టీ సిబ్బంది అథెంటిక్‌గా ఉన్నందున బయో మెట్రిక్ మెషిన్‌లో జీహెచ్ ఎంసీ, విద్యా శాఖ రెండు ఆప్షన్లను చూపిస్తోంది. ఆ సమయంలో అక్కడున్న థర్డ్ పార్టీ సిబ్బంది ఏ శాఖ నుంచి ఉంటే ఆ శాఖను టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇతర జిల్లాల కార్డుదారులు పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలనుకుంటే, సదరు కార్డుదారులు మాత్రమే వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారం హైదరాబాద్ లోని 674 రేషన్ దుకాణాల్లో 369 మంది విద్యాశాఖ, మిగతా 305 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పర్యవేక్షణలో విధులు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed