వాళ్లంతా స్టంట్ మాస్టర్లు : మంత్రి జగదీష్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-07-09 04:47:56.0  )
minister jagadish reddy
X

దిశ సూర్యా పేట : ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు స్టంట్ మాస్టర్లలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి స్టంట్లన్నీ కెమెరాలకే పరిమితం అని ఆయన ఎద్దేవా చేశారు. అటువంటి వారి వెంట ప్రజలు ఎవరూ నడిచేందుకు సిద్ధంగా లేరని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం రోజున ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని వదులుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదన్నారు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రిగా తెలంగాణాకు ఏమి చేశారు… తెలంగాణా ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోజున ఉద్యమ నేతగా ఎలా సాధించారు అన్నది ఇక్కడి ప్రజలకు స్పష్టంగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.

అసలు ఈ రోజున అవాకులు, చవాకులు పేలుతున్న వారికి వచ్చిన పదవులు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన భిక్షమేనని ఆయన విమర్శనలు చేశారు. తెలంగాణ అనే పదమే లేకుండా వారికి ఈ పదవులు దక్కేవా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఉన్న వారి వారి స్టంట్లన్నీ దారిలో పోయేవారు చూసి కాలక్షేపం చేస్తారేమో గాని వెంట నడువరని ఆయన జోస్యం చెప్పారు. ముందుగా ఆ విషయం తెలుసుకుని మసులుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. పైరవీలతో పదవులు రావొచ్చు ఏమో కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతాం… ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతాం అంటే తెలంగాణ సమాజం చూస్తూ ఉరుకోబోదని ఆయన హెచ్చరించారు. సందర్భం వచ్చినప్పుడు కర్రుకాల్చి వాత పెట్టడంలో తెలంగాణ సమాజం ముందుంటుందన్నారు. ప్రజాసేవే చేయాలని తాపత్రయపడుతున్న వారు ముందుగా ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చెయ్యాలి తప్ప ఇటువంటి స్టంట్లు కాదని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed