నాటిన చోటే మళ్లీ మళ్లీ..

by  |
నాటిన చోటే మళ్లీ మళ్లీ..
X

దిశ, మేడ్చల్: హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్లలో మొక్కలు నాటాలని ప్రభుత్వం చెబుతోంది. ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన మొక్కలు నాటాలని, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటేలా టార్గెట్ పెట్టింది. ఇప్పటికే 5 విడుతల్లో మొక్కలు నాటగా.. ప్రస్తుతం ఆరో విడతకు సిద్ధం అవుతోంది. కాగా, మొక్కలు నాటేందుకు జాగ లేకపోవడంతో నాటిన చోటే మళ్లీ నాటుతున్నారు. దీంతో మొక్కల మధ్య దూరం అరగజం కూడా ఉండట్లేదు. గత ఐదేళ్ల కాలంలో 182.74 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు చెప్తున్నారు. వీటిలో అడవుల్లో నాటినవి 30.97 కోట్లు, మిగితా ప్రాంతాల్లో 151.77 కోట్లు నాటినట్లు అధికార గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి ఆరో విడత హరితహారంలో భాగంగా మరో 20 కోట్ల మొక్కలు నాటేందుకు టార్గెట్ పెట్టుకోగా, ఇందుకోసం 24.74 కోట్ల మొక్కలను రెడీగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

ఐదేళ్లుగా నాటిన చోటే..

మొక్కలు నాటేందుకు స్థలం లేక ఐదేళ్లుగా నాటిన చోటే మొక్కలు నాటుతున్నారు. రోడ్లకు ఇరువైపులా, విద్యాలయాలు, పోలీస్ ప్రాంగణాలు, మార్కెట్ యార్డులు, వ్యవసాయ క్షేత్రాలు, శ్మశాన వాటికలు, పరిశ్రమలు, పరిశ్రామిక వాడలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో మొక్కలు నాటినట్లు ఏటా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుత ఆరో విడతలో కూడా పైన పేర్కొన్న ప్రాంతాల్లోనే నాటాలని నిర్ణయించారు. నాటిన మొక్కల్లో ఎన్ని ఉన్నాయో తేల్చాలని గతంలో ప్రభుత్వం ఆదేశిస్తే 70 నుంచి 90 శాతం మొక్కలు బతికినట్లు అధికార యంత్రాంగం నివేధిక సమర్పించింది. ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన నివేదికల ప్రకారం పైన పేర్కొన్న ప్రాంతాలలో పెద్దగా మొక్కలు నాటాల్సిన అవసరంలేదన్న మాట.. కానీ హరితహారం పేరిట నాటిన ప్రాంతాలలో తిరిగి మొక్కలు నాటేందుకు ఈసారి ప్రభుత్వం హడావిడి చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి బెంగుళూర్,విజయవాడ, ముంబాయి, వరంగల్, నాగపూర్,కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటినా.. పరిరక్షించడంలో విఫలమయ్యారు. ఈ మధ్యనే సీఎం కేసీఆర్ ఎర్రబెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తూ.. రాజీవ్ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించడంతో మళ్లీ మొక్కలను నాటుతున్నారు.

ఐదేళ్లలో నాటిన మొక్కల వివరాలు..

సంవత్సరం నాటిన మొక్కలు(కోట్లలో)
2015-16 15.86
2016-17 31.67
2017-18 34.07
2018-19 32
2019-20 38.18
2020-21 20 లక్ష్యం

Next Story

Most Viewed