- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ధరణి’ భారం.. మ్యుటేషన్ చార్జీ అదనం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రమొచ్చిన తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ మారుమూల ప్రాంతమైనా ఎకరా కనీసం రూ.10 లక్షలు పలుకుతోంది. అదే స్థాయిలో ప్రభుత్వ సేవలు కూడా ఖరీదుగా మారుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో ఉచితంగానే అందించే సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో వసూలు చేస్తోందని రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. స్టాంపు డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోగా కేవలం రికార్డుల్లో పేర్లు మార్చే ప్రక్రియకు ఎకరాకు రూ.2500 వసూలు చేస్తామనడం సరైంది కాదంటున్నారు. గతంలో మాదిరిగానే మ్యుటేషన్ చేసినప్పుడు పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారు. కొత్తగా ఫీజు చెల్లించడం ద్వారా కొనుగోలుదారుకు లేదా రైతుకు అందే మెరుగైన సేవలేం ఉన్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. కేవలం ‘ధరణి’ పోర్టల్ లో నమోదు తప్ప మరో కొత్త మార్పేమీ లేదంటున్నారు. ఎవరైనా ఐదెకరాలు కొనుగోలు చేస్తే భూ హక్కులు మార్పిడి చేసేందుకు రూ.12,500 చార్జీలు చెల్లించాల్సిందే. పైగా పోస్టల్ చార్జీలు, పట్టాదారు పాసు పుస్తకాల కోసం అదనంగా చెల్లించాలి. గతంలో ఎప్పుడూ చార్జీలు విధించలేదు. రైతులకు అన్నీ ఉచితంగానే చేశారు.
అక్కడ ‘మీ భూమి’
ఉమ్మడి రాష్ట్రంలో ‘మా భూమి- మీ భూమి’గా ఉన్న డిజిటల్ భూ రికార్డుల వెబ్‌సైట్‌ను రెండుగా విభజించారు. అందులో ‘మా భూమి’ పోర్టల్‌గా తెలంగాణకు, ‘మీ భూమి’గా ఆంధ్రప్రదేశ్‌కు మనుగడలోకి వచ్చాయి. ఇప్పటికే అక్కడ ‘మీ భూమి’ కొనసాగుతోంది. దాని ద్వారానే రైతులకు, భూ హక్కుదారులకు అన్ని రకాల సేవలను అందిస్తున్నారు. తెలంగాణ మాదిరిగానే అక్కడా అన్ని రికార్డులను డిజిటలైజేషన్ చేశారు. భూ లావాదేవీలు జరగగానే 30 రోజుల్లో మ్యుటేషన్ ఆటోమేటిక్‌గా పూర్తవుతుంది. దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. తహసీల్దార్ కార్యాలయం మెట్లెక్కే పని లేకుండానే మ్యుటేషన్ పూర్తవుతుంది. స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టాంపు డ్యూటీ మినహా పైసా చార్జీ లేకుండానే ప్రక్రియ పూర్తవుతుంది.
నేటి నుంచి సాంకేతిక సమస్యలతోనే షురూ
ధరణి పోర్టల్ నిర్వహణలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేటి నుంచి రాష్ట్రంలో అధికారికంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ప్రారంభిస్తున్నారు. ఒక్కో తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు 10 స్లాట్లకు అనుమతి ఇచ్చారు. ఉ.10.30 గంటలకు తొలి స్లాట్ ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 3 గంటలకు చివరి స్లాట్ ఉంది. ఒక్కో రిజిస్ట్రేషన్ మధ్య అరగంట గ్యాప్ ఇస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో నమూనా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై సాధన కొనసాగుతూనే ఉంది. సాంకేతిక సమస్యలను అధిగమిస్తేనే సక్సెస్ అవుతుందంటున్నారు.