భద్రాచలంలో రామయ్య భక్తులకు తప్పని తిప్పలు

by Sridhar Babu |
భద్రాచలంలో రామయ్య భక్తులకు తప్పని తిప్పలు
X

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం వారు భక్తుల బాధలు పట్టించుకోవడంలేదు. ఆలయం వద్ద తరచూ లిఫ్ట్ మరమ్మత్తులకు గురవుతున్నా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కరోనా కాసింత తగ్గుముఖం పట్టడంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ రాకముందే తమ మొక్కుబడులు చెల్లించుకోవాలనే తలంపుతో భద్రాచలం ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఏరకమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉంది. ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. వృద్ధులు, పిల్లలు, దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన లిప్టు పనిచేయని కారణంగా ఆలయం మెట్లు ఎక్కిదిగడానికి పాట్లు పడ్డారు.

లిప్టు పనిచేయకపోవడం ఇది కొత్త కాదని, తరచూ ఇలాగే పాడైనా శాశ్వత మరమ్మత్తులు చేపట్టడంలేదని, జిల్లాలో అందుబాటుగా ఉన్న వాళ్ళతో రిపేరు చేయించకుండా ఎక్కడి నుంచో రావాలని రోజుల కొద్దీ జాప్యం చేయడం వలన భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. గత మూడు రోజులుగా లిప్టు పనిచేయడంలేదని స్థానికులు తెలిపారు. మరమ్మత్తులు చేసేవాళ్ళు వచ్చే వరకు దాని అతీగతి అంతే అనేది భక్తుల ఆరోపణ. ఒకటి రిపేరుకి వచ్చినపుడు మరొకటి ఉపయోగపడేలా రెండవ లిప్టు ఏర్పాటు అవసరమనేది భక్తుల అభిప్రాయం. ఈ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళినా ఫలితంలేదని భక్తులు తెలిపారు. భక్తుల గోస పట్టించుకునే వారు కరువైనారని ప్రజలు విమర్శిస్తున్నారు. కనుక ఇప్పటికైనా భక్తుల విన్నపాన్ని దేవస్థానం అధికారులు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story