- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్‌లో సొంతిల్లు లేని దళితులు ఉండొద్దు : సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : ‘దళితబంధు’ పథకం గురించి వివరించడానికి హుజూరాబాద్ నుంచి 16 బస్సుల్లో 412 మందిని ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పథకం గురించి చెప్తూనే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను వివరించి, అందుకు సహకారం ఇవ్వాలని కోరారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ ఎన్నికల చుట్టూ తిప్పుకొచ్చిన సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం దళితులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ స్పెషల్ డ్రైవ్ చేపట్టి పది రోజుల్లోనే పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ కర్ణన్‌ను ఆదేశించారు.
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు చరిత్రాత్మకం కావాలని, దేశంలోనే చిరస్థాయిగా నిలిచిపోయేదిగా ఉండాలని, అది అక్కడి ప్రజలతోనే సాధ్యమవుతుందన్నారు. ఇప్పుడు దళితబంధు గురించి ప్రజలకు వివరించి మొత్తం దేశానికే వెలుగును ప్రసరింపజేయాలని సూచించారు. ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన దళితులతో సుదీర్ఘంగా ముచ్చటించిన కేసీఆర్ వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
దళితులందరికీ సొంత ఇండ్లు, ఉచిత వైద్యం
హుజూరాబాద్ నియోజకవర్గంలో సొంతిల్లు లేని దళిత కుటుంబాలు ఉండొద్దని, వెంటనే వందశాతం ఇంటి సమస్య తీరాలని అధికారులను సీఎం ఆదేశించారు. హుజూరాబాద్‌లో ఖాళీ జాగలు ఉన్నవారికి ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వమే ఆర్థికసాయం చేస్తుందని, దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా దళితులందరికీ దీన్ని అమలు చేస్తుందని సీఎం తెలిపారు. ఆ నియోజకవర్గ దళిత వాడల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించాలని, నివేదిక తయారు చేసి అధికారులకు అందజేస్తే ప్రభుత్వమే ఉచితంగా వైద్యసాయం అందిస్తుందని స్పష్టంచేశారు. రేషన్ కార్డులు, పింఛన్లు సహా అన్ని రకాల సమస్యలను, గుర్తించి అధికారులకు నివేదిక అందజేయాలన్నారు.
హుజూరాబాద్ విజయంపైనే దళితబంధు భవిష్యత్తు
‘‘తెలంగాణ దళితబంధు అనేది కేవలం ఒక కార్యక్రమమే కాదు. ఇదొక ఉద్యమం. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీదనే యావత్ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉంటది. అందరూ ఆ దిశగా ధృఢ నిర్ణయం తీసుకోవాలి. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద వత్తిడి తెచ్చి విజయాన్ని సాధించి పెట్టింది. ప్రతి విషయంలో ప్రతీప శక్తులు ఎప్పుడూ ఉంటాయి. మనం నమ్మిన ధర్మానికి కట్టుబడి మన ప్రయాణాన్ని మనం కొనసాగించినప్పుడే విజయం సాధిస్తం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. లబ్ధిదారులకు చిప్, బార్‌కోడ్‌తో కూడిన దళితబంధు స్మార్ట్ గుర్తింపు కార్డు ఇస్తామని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు.
దళితవాడల ప్రొఫైల్
దళితబంధు పథకం అమలుతోపాటు దళితవాడల్లో తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలను తక్షణం పూర్తి చేయాలని, దళితుల స్వాధీనంలో ఉన్న గ్రామ కంఠాల భూముల వివరాల జాబితా తయారు చేయాలని, దళితులకే హక్కులు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు. హుజూరాబాద్‌లో వారం, పది రోజుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అసైన్డ్ భూముల సమస్యలు సహా దళితులకు సంబంధించిన అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని, దళిత ప్రజల డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ సమస్యలను గుర్తించి వారిని ఆఫీసుకు పిలిపించుకొని పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్‌ను సీఎం ఆదేశించారు. దళితవాడల స్థితిగతులను తెలియజేసే ప్రొఫైల్‌ను తయారు చేయాలన్నారు.
లైసెన్సుల్లో దళితులకు రిజర్వేషన్లు
ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, మద్యం దుకాణాలు తదితర ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండే అన్ని రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లను కల్పిస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే ఇతర రంగాలను కూడా గుర్తించాలని, వాటిలో కూడా రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పవర్ టిల్లర్, హార్వెస్టర్, వరి నాటు వేసే యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కోళ్ల పెంపకం, టెంట్ హౌజ్, డెయిరీ పరిశ్రమ, ఆయిల్ మిల్లు, పిండి మిల్లు, సిమెంట్ ఇటుకల పరిశ్రమ, హోటల్, స్టీల్ సిమెంట్ వంటి బిల్డింగ్ మెటీరియల్ షాప్స్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్ దుకాణాలు, మొబైల్ టిఫిన్ సెంటర్స్, హోటల్స్, క్లాత్ ఎంపోరియం, ఫర్నీచర్ షాప్ వంటి పలురకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి, వారి వారి ఇష్టాన్ని బట్టి , దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు.
శాశ్వతంగా ‘దళిత రక్షణ నిధి’
‘దళితబంధు‘ పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా, ప్రభుత్వమే లబ్ధిదారుల భాగస్వామ్యంతో శాశ్వత ప్రాతిపదికన ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేస్తుందని, జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణతో లబ్దిదారుల కమిటీలతో నడుస్తుందన్నారు. ప్రతీ ఏటా కనీస డబ్బును జమ చేస్తూ, దళిత రక్షణ నిధిని నిరంతరంగా కొనసాగిస్తూ, ఆర్థికంగా మరింత పటిష్టంగా నిలదొక్కుకునే దిశగా ఇది పనిచేస్తుందని, అవకాశం లేనివారికి సహకారం అందిస్తూ దారులు వేస్తుందని పేర్కొన్నారు.
‘‘మీ విజయం, ఇతర కులాలకు, వర్గాలకు, పక్క రాష్ట్రాలకు మాత్రమే కాదు, మొత్తం దేశానికే వెలుతురును ప్రసరింపచేస్తుంది. దళితులు విజయం సాధించాలి. వెలుగు దివ్వెలు కరదీపికలుగా మారాలి. ఆ పట్టుదల మీలో పెరగాలి. మీ దగ్గరి నుంచి ప్రసరించే విజయపు వెలుతురు తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రసరించాలన్నదే నా ఆకాంక్ష’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆర్థికంగా బలపడితే వివక్షకు దూరం
“మనలో కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోవాలి. పరస్పర విశ్వాసం పెరగాలి. ఒకరికొకరం సహకరించుకోవాలి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను వాపస్ తీసుకోవాలి. అప్పుడే మన విజయానికి బాటలు పడతాయి. దళితులు ఆర్థికంగా పటిష్టమైనప్పుడే వివక్ష నుంచి దూరం అవుతాం. సదస్సులో పాల్గొన్నవారంతా దళితులకు అవగాహన కల్పించాలి. హుజూరాబాద్‌లో విజయం సాధించాలి. దళితబంధును విజయవంతం చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని, అంటరానితనం పేరుతో ఊరవతల ఉంచి, ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికే పరిమితం చేయడం కూడా దుర్మార్గం. ఇది తెలివి తక్కువ పనే’’ అని అన్నారు.
దళితుల్లో పులికి ఉండేంత శక్తి నిబిడీకృతమై ఉన్నదని, దాన్ని గుర్తించి ముందుకు సాగాలని సూచించారు. దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించిందని, బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, సర్కారే స్వయంగా అండగా ఉన్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు కాపలా వర్గంగా డేగ కన్నుతో పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దళిత ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు దళితబంధును కీర్తిస్తూ ప్రసంగించారు. హుజూరాబాద్ నుంచి వచ్చిన దళితులు సైతం ఈ పథకం ద్వారా వచ్చే నగదుతో ఏమేమి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో, జీవితంలో ఎలా స్థిరపడాలనుకుంటున్నారో ముఖ్యమంత్రితో వారివారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఏ రంగాలను ఎంచుకుంటే స్థిరపడే అవకాశం ఉంటుందో అధికారులు కొన్ని సూచనలు చేశారు.